సాక్షి, సిటీబ్యూరో: గత సంవత్సరం విజృంభించిన దోమలు..పెరిగిన డెంగీ కేసులను దృష్టిలో ఉంచుకున్న జీహెచ్‌ఎంసీ..ఈ సంవత్సరం మే మాసం నుంచే దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం లాగా వర్షాలొచ్చే జూన్‌లో కాకుండా అంతకంటే ముందే.. మే నెల్లోనే దోమల నివారణ చర్యలు విస్తృతంగా చేపట్టనున్నారు. గ్రేటర్ పరిధిలో 160కి పైగా చెరువులుండగా, వీటిల్లో దోమల పెరుగుదలకు కారణమైన గుర్రపుడెక్క ఎక్కువగా ఉన్న 40 చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపుతో పాటు చెరువు మొత్తండ్రోన్‌ల ద్వారా దోమల నివారణ మందుల్ని స్ప్రే చేయనున్నారు. మెషిన్లతో తొలుత చెరువుల్లోని గుర్రపు డెక్కను మొత్తం పూర్తిగా తొలగిస్తారు. తర్వాత జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం కార్మికులు ఎప్పటికప్పుడు చెరువుల ఒడ్డున పెరిగే గుర్రపు డెక్కను తొలగిస్తారు.
చెరువుల్లోని దోమల లార్వాలను అంతం చేయడంతోపాటు, తిరిగి కొత్తవి రాకుండా డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందుల్ని స్ప్రే చేస్తారు. ఇవి చెరువుల్లో దోమలు పెరగకుండా తీసుకునే నివారణ చర్యలు కాగా.. నగరంలో దోమలు పెరగకుండా ప్రతి రోజూ ప్రతి సర్కిల్, ప్రతివార్డులో ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకుగాను ప్రతి వార్డుకు రెండు పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు, ప్రతి సర్కిల్‌కు రెండు వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లను వినియోగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఎంటమాలజీ) రాహుల్‌రాజ్ తెలిపారు. ఈ లెక్కన గ్రేటర్ వ్యాప్తంగా 300 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లు, 60 వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్లు వినియోగించనున్నారు. ఓవైపు కరోనా కట్టడిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా క్రిమిసంహారక మందుల స్ప్రే జరుగుతున్నప్పటికీ, మరోవైపు దోమల నివారణ చర్యలు కూడా చేపట్టేందుకు ఎంటమాలజీ విభాగం సమాయత్తమవుతోంది.
సిబ్బందికి రక్షణ కిట్లు
జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఎంటమాలజీ విభాగం సిబ్బందికి సైతం పారిశుధ్య సిబ్బందితోపాటే ఏడాదికి సరిపడా సామాగ్రితో కూడిన రక్షణ కిట్‌ను అందజేయనున్నట్లు రాహుల్‌రాజ్ తెలిపారు. కిట్‌లో పది రకాల వస్తువులుంటాయన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి సరిపడా 56 మాస్కులు, రెండు జతల గ్లవుజులు, శానిటైజర్లు, 36 సబ్బులు, 6 లీటర్ల కొబ్బరి నూనె, రెయిన్ కోట్, రేడియం జాకెట్, క్యాప్, షూ, బాత్‌టవల్, కిట్‌లో ఉంటాయన్నారు.
అభినందనలు
జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది పనితీరును వెల్లడిస్తూ జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం రూపొందించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని వారిని ఉద్దేశించి ఎంతో గొప్పగా పనిచేస్తున్న యోధులంటూ వారిని ప్రశంసించారు.
కరోనా నివారణ విధుల్లో..వీడ్కోలు
గురువారం పదవీ విరమణ చేయనున్న జీహెచ్‌ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్‌ను అడిషనల్ కమిషనర్ రాహుల్‌రాజ్, ఇతర అధికారులు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. గత సెప్టెంబర్‌లో జీహెచ్‌ఎంసీకి వచ్చిన డాక్టర్ అమర్ డెంగీ వ్యాప్తి తరుణంలో, ప్రస్తుతం కరోనా నివారణ చర్యల్లో అందరినీ కలుపుకొని పనిచేశారని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment