సాక్షి, సిటీబ్యూరో: నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి.ప్రాణాంతక డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్ని చర్యలు తీసుకున్నా నివారణ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బల్దియా దోమల నివారణకు ఆధునిక ఆయుధాలను ప్రయోగిస్తోంది. ఇందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. దోమ లార్వాలను తుదముట్టించేందుకు అవసరమైన మందును స్ప్రే చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను వినియోగిస్తోంది. మరోవైపు కొత్తగా నానో టెక్నాలజీతో ప్రత్యామ్నాయ మందును స్ప్రే చేసే ప్రయోగం సైతం చేపట్టింది. డ్రోన్లతో ఇప్పటికే సత్ఫలితాలు వెలువడగా... ప్రత్యామ్నాయ మందు ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. జీహెచ్‌ఎంసీకి చెందిన 650 ఎంటమాలజీ బృందాలు రోజుకు సగటున 1.40 లక్షల ఇళ్లలో తనిఖీలు చేస్తూ దోమల నివారణ మందు స్ప్రే చేస్తున్నాయి. ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవి ఇళ్లల్లో చేసే కార్యక్రమాలు కాగా...దోమలకు ఆవాసాలైన చెరువులు, సరస్సుల్లో యాంటీ లార్వా ఆపరేషన్లకు పడవలు వేసుకొని వెళ్లాల్సి వస్తోంది. ఫీకల్ స్లడ్జ్‌తో కూడిన చెరువుల్లోకి దిగినప్పుడు సిబ్బందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా టీహబ్‌లోని ఓ అంకుర సంస్థ దోమల నివారణ మందును స్ప్రే చేయడానికి తగిన నాసిల్స్‌తో కూడిన డ్రోన్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. దీన్ని తొలుత మియాపూర్ గుర్నాథం చెరువులో ప్రయోగించారు. సత్ఫలితాలు రావడంతో దాదాపు పది రోజుల క్రితం నగర మేయర్ రామ్మోహన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
తగ్గిన లార్వా...
ఒక లాడిల్ (సాంబారు గరిటె లాంటి పరికరం) పరిమాణంలోని (దాదాపు 40 మీ.లీ) నీటిలో లార్వాలు 120 నుంచి 20కి తగ్గాయి. లార్వా నివారణకు ఎంతో కాలంగా వాడుతున్న పైరిథ్రిన్, సిఫనోథ్రిన్ లాంటి ఆయిల్స్ స్ప్రేతోనే ఇది సాధ్యమైంది. డ్రోన్ ద్వారా చెరువు మొత్తం మందు పిచికారీ చేయడంతో ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. దీని వినియోగం ద్వారా ఎంటమాలజీ కార్మికులు దుర్గందభరిత చెరువుల్లోకి దిగాల్సిన పని లేదు. అంతేకాదు దాదాపు 10 మంది నెల రోజుల పాటు చేసే పనిని డ్రోన్ ద్వారా ఒక్క రోజులో చేయడం సాధ్యమైంది.
మిగతా చెరువుల్లోనూ...
శేరిలింగంపల్లి జోన్‌లోని గుర్నాథం చెరువులో వచ్చిన ఫలితాలతో దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, గోపీ చెరువు, హైటెక్స్ దగ్గరి చెరువుల్లోనూ డ్రోన్‌తో స్ప్రే చేశారు. ఖైరతాబాద్ జోన్‌లోని అహ్మద్‌నగర్ నాలా, గోల్కొండ, లంగర్‌హౌస్, సాతం చెరువు తదితర ప్రాంతాల్లో కూడా డ్రోన్‌తో స్ప్రే ప్రారంభించినట్లు జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖి తెలిపారు. గుర్రపుడెక్క తొలగింపునకు తాము డీవీడింగ్ యంత్రాలు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎంటమాలజీ సిబ్బందితో చెరువుల్లో దోమల మందు పిచికారీకి దాదాపు నెల రోజులు పడుతుంది. 10మంది బృందం పని చేయాల్సి ఉంటుంది. చెరువు ఒడ్డు నుంచి దాదాపు పది అడుగుల లోపలికే తప్ప.. చెరువు మధ్యలోకి వెళ్లడం కుదరదు. అదే డ్రోన్ ద్వారా చెరువు మొత్తం స్ప్రే చేయొచ్చ’ని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ తెలిపారు. డ్రోన్ ద్వారా ఒక పర్యాయం 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చన్నారు.
మూసీలోనూ...
వివిధ చెరువులతో పాటు దోమలకు నిలయమైన మూసీలోనూ యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. దోమల నివారణకు డ్రోన్‌లను వినియోగిస్తున్నాం. మెరుగైన ఫలితాలు కనిపిస్తుండడంతో క్రమేపీ నగరంలోని అన్ని చెరువులకూ వీటిని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తాం. – బొంతు రామ్మోహన్, మేయర్
త్వరలో నానోటెక్నాలజీతో...
దోమల నివారణకు సంప్రదాయ మందుల స్థానంలో ప్రత్యామ్నాయ మందుగా నానో టెక్నాలజీ, సిల్వర్ పార్టికల్స్‌తో లార్వాలను నివారించవచ్చని ఓయూ ప్రొఫెసర్ ఒకరు కనిపెట్టారు. ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఈటీపీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఆమోదం తెలపడంతో పీసీబీకి కూడా లేఖ రాశాం. దాని స్పందనను బట్టి వినియోగిస్తాం. సిల్వర్ వాడకంతో మనుషులకు ఎలాంటి హానీ ఉండదు. ఇప్పటి వరకు లార్వాల నివారణకు డ్రోన్ల ద్వారా స్ప్రే కూడా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. పైన వేలాడే తీగలు లేని, తగినంత ఓపెన్ ప్లేసెస్ ఉన్న చెరువులకు మాత్రమే డ్రోన్ వినియోగం సాధ్యం. ఇరుకు ప్రాంతాల్లో డ్రోన్ వెళ్లలేదు. గుర్రపుడెక్కను తొలగించేందుకు వీడిసైడ్స్‌కు కూడా డ్రోన్‌లను వాడుతున్నప్పటికీ, ఫలితాలను పరిశీలించేందుకు సమయం పడుతుంది. దాదాపు 25 ఎకరాల చెరువులోనైనా డ్రోన్‌తో ఒకే రోజులో స్ప్రే సాధ్యమవుతుంది. ఇందుకు డ్రోన్ అద్దె దాదాపు రూ.25వేలు. – హరిచందన దాసరి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (లేక్స్ విభాగం)
సత్ఫలితాలు
⇔ ప్రత్యేక డ్రోన్‌తో మందు స్ప్రే చేయడం ద్వారా నీటిలో లార్వాల సంఖ్య తగ్గింది.
⇔ 10 మంది బృందం నెల రోజుల పాటు పిచికారీ చేసే మందును ఈ డ్రోన్ ఒక్క రోజులోనే చేస్తుంది.
⇔ దీనితో ఒకేసారి 10 లీటర్ల మందు తీసుకెళ్లొచ్చు.
⇔ దాదాపు 25 ఎకరాలచెరువులోనైనా ఒకే రోజులో స్ప్రేసాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment