నిర్లక్ష్య రోగం!
విజయనగరం ఆరోగ్యం:ప్రభుత్వం సరఫరా చేసిన దోమల నివారణ మందును ఇప్పటికే గ్రామాల్లో పిచికారీ చేయాలి. అయితే అలా జరగలేదు. ఆ మందు ఇంకా పీహెచ్‌సీల్లో మూలుగుతోంది. తాము ఎప్పుడో మందును సరఫరా చేశామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈనెలలోనే వచ్చినట్టు వైద్యాధికారులు అంటున్నారు. ఏది నిజయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏప్రిల్‌లోనే మందు సరఫరా
సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులును వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఈఏడాది ముందుస్తు చర్యలు చేపట్టింది. వ్యాధులను కలగజేసే దోమల ను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పల్లె, పట్టణాల్లో పిచికారీ చేయడం కోసం దోమల నివారణకు ఉపయోగించే లార్విసెడ్, మలథీయాన్‌మందును ఏప్రిల్ నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సరఫరా చేసింది. వీటిని పీహెచ్‌సీలు ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఆ మందులు ఇంకా పీహెచ్‌సీల్లోనే మూలుగుతున్నా యి. వైద్య ఆరోగ్యశాఖ సరఫరా చేసినమూటలను కూడా సబంధిత సిబ్బంది ఇంకా చాలా గ్రామాల్లో విప్పినట్టు లేదు. గంట్యాడ మండలంలోని పరిధిలోని పెదవేమలి, మురపాక, సిరిపురం, గ్రామాలను పరిశీలించగా ఇంకా ఆయా పంచాయతీలకు మందు చేరలేదు. అదేవిధంగా విజయనగరం మండలంలోని జొన్నవలస, పినవేమలి, రాకోడు గ్రామాలకు కూడా మందు చేరలేదు.
జిల్లాకు సరఫరా అయిన మందు వివరాలు
గ్రామాల్లో పిచికారీ చేయడానికి 1200 లీటర్లు లార్విసెడ్ కెమికల్, పట్టణాలకు 840 లీటర్లు మలాథి యాన్ , 330 లీటర్ల లార్విసెడ్ కెమికల్‌ను సరఫరా చేశారు. మందును జిల్లాలో ఉన్న 68 పీహెచ్‌సీలు ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు సరఫరాచేయాలి. మున్సిపాల్టీలకు మలేరియా సబ్ యూని ట్ సిబ్బంది అందజేయాలి. మందు సరఫరా అయి రెండు నెలలు అవుతున్న ఇంతవరకు మూటలు కూడా విప్పని పరిస్థితి. దీంతో గ్రామాల్లో మందును పిచకారీ చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. జిల్లా వాసులకు మలేరియా, వైరల్,డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నాయి.
వారానికి ఒకసారి పిచికారీ చేయాలి
గ్రామాలు, పట్టణాల్లో లార్విసెడ్, మలథీయా న్ మందును కాల్వల్లో వారానికి ఒకసారిపిచికారీ చేయాలి. ఇప్పటికే ఈకార్యక్రమాన్ని ప్రారంభిం చాల్సి ఉంది. కాని ఇంతవరకు ప్రారంభం కాలేదు. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పారిశుధ్యం ఆధ్వాన్నంగా ఉంది. దీంతో దోమల వ్యాప్తి అధికంగా ఉంది. మందు పిచికారీ చేసి ఉంటే దోమల తగ్గేవి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వల్ల దోమలు మరింత అధికమయ్యే ప్రమాదం ఉంది.
ఏప్రిల్‌లోనే సరఫరా చేశాం...
లార్విసెడ్, మలాథియాన్ మందులను ఏప్రిల్ నెలలోనే పీహెచ్‌సీలకు సరఫరా చేసేశాం. వాటిని గ్రామాలకు అందజేయమని ఆదేశాలు కూడా జారీ చేశాం. గ్రామాలకు సరఫరా కాని విషయం ఇంతవరకు నాకు తెలియదు. తక్షణమే గ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం.
- యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్.
ఈ నెలలోనే మందు వచ్చింది
మా పీహెచ్‌సీ పరిధిలో 19 పంచాయతీలున్నాయి. మాకు ఈనెల 5వతేదీన 5 లీటర్లు లార్విసెడ్ మందు ఇచ్చారు. మందు పూర్తి స్థాయిలో సరిపోతుందో లేదోనని తర్జన భర్జన పడ్డాం. ఒకటి రెండు రోజుల్లో పంచాయతీలకు పంపిస్తాం
- డాక్టర్ రాజశేఖర్,
గంట్యాడ పీహెచ్‌సీ వైద్యాధికారి