డీఎంహెచ్‌ఓ సుధాకర్ అరెస్ట్
Published Tue, Jan 28 2014 3:44 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. సెలైంట్ కిల్లర్‌గా పేరుపొంది పలు సంచలన హత్యలు చేసిన సయ్యద్ అబ్దుల్ కరీం అలియాస్ మున్నా గుప్తనిధులను కనిపెట్టే బాబాగా అవతారం ఎత్తి పలువురిని నిలువునా మోసం చేస్తూ వస్తున్నాడు. ఇటీవల కర్నూలులో ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులకు పట్టుబడటంతో వారి విచారణలో ఆయన చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ చింతమాల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒంగోలు తాలూకా ిసీఐ ఐ.శ్రీనివాసన్ డాక్టర్ సుధాకర్‌ను మరో నలుగురిని అరెస్ట్ చేసి సోమవారం ఒంగోలులోని మూడో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై మోసం, కుట్ర, హత్యాయత్నం తదితర సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన మున్నా గతంలో ఆయుర్వేద వైద్యుడిగా ఉంటూ జాతీయ రహదారిపై మారణకాండను కొనసాగించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్‌తో పాటు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి బాబాగా అవతారమెత్తాడు.
ఈ ముఠా గుప్తనిధుల తవ్వకాలతో పేరుతో పలువురిని మోసం చేసింది. వీరి ట్రాప్‌లో చిక్కుకున్న చింతమాల శ్రీనివాస్ లక్షలాది రూపాయలు మున్నా గ్యాంగ్‌కు సమర్పించుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించి వాటిని తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఈ నెల 18న ఆయనను కిడ్నాప్ చేసి ప్రకాశం జిల్లా చేజర్ల మండలం సరుగుతోటల వద్ద హతమార్చేందుకు యత్నించారు. శ్రీనివాస్ వారి నుంచి తప్పించుకొని ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సుధాకర్‌తో పాటు మరో నలుగురు నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఒంగోలు జైలుకు తరలించారు.
Advertisement