
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు డాక్టర్ కె.సుధాకర్ విషయంలో అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు బుధవారం నివేదించింది. సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతిన ఇవ్వాలని కోరింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను జత చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment