anesthesiologist
-
డాక్టర్ సుధాకర్ కేసులో దర్యాప్తు పూర్తి చేశాం
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు డాక్టర్ కె.సుధాకర్ విషయంలో అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు బుధవారం నివేదించింది. సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతిన ఇవ్వాలని కోరింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని, వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోను జత చేశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. -
మత్తు డాక్టర్లకు... మస్తు 'రిస్క్'
సాక్షి, హైదరాబాద్: కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రతి ఒక్కరూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. చేసూ్తనే ఉన్నారు. కాకపోతే... మన దృష్టికి అంతగా రానిది కరోనా చికిత్సలో మత్తు డాక్టర్ల (అనస్థీషియన్ల) పాత్ర. క్రిటికల్ కేర్‌లో కీలక భూమిక పోషించే మత్తు డాక్టర్లకు సాధారణ వైద్యులతో పోలిస్తే మూడురెట్లు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారు కరోనా చికిత్సల్లో రోగులకు అత్యంత దగ్గరగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆ సంస్థ తన అనుబంధ జర్నల్ ‘అనస్థీషియా పెయిన్ అండ్ ఇంటెన్సివ్ కేర్’లో కరోనా కథ ముగిసే నాటికి అంతర్జాతీయ సమాజం మత్తు వైద్యులను రియల్ హీరోలుగా గుర్తిస్తుందని చెప్పింది. మన దేశంలో ఇప్పటివరకు 30 మంది మత్తు వైద్యులు కరోనాతో చనిపోయారు. అంటే ప్రతీ 10 వేల మంది మత్తు వైద్యులకు ఆరుగురు కరోనాతో చనిపోయారని కేంద్రం వెల్లడించింది. ఇది సామాన్య కరోనా మరణాల రేటుతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. సాధారణ వైద్యులతో పోలిస్తే వీరికి మూడు రెట్లు ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది. క్రిటికల్ కేర్‌లో కీలకం కోవిడ్‌పై ఏప్రిల్‌లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐసీయూ నిర్వహణలో ఐదుగురు వైద్యులను భాగస్వామ్యం చేసింది. అందులో మత్తు వైద్యులను మొదటి వరుసలో నిలిపింది. వీరితో పాటు జనరల్ మెడిసిన్, చెస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్లు అందులో ఉన్నాయి. కరోనా కాలంలో ఎవరైనా అత్యవసర వైద్యం కోసం వస్తే కృత్రిమ శ్వాస అంది స్తారు. రికవరీ అయ్యే వరకు చికిత్స అందించడంలో ఇతరులతో కలిసి మత్తు డాక్టర్లు పనిచేస్తారు. దీంతో రోగులకు అత్యంత దగ్గరగా ఉండాల్సి వస్తుంది. రోగికి వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటే... మత్తు వైద్యులకు అధిక ప్రమాదం పొంచి ఉంటుంది. కరోనా సీరియస్ రోగులకు సీటీస్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు కృత్రిమ శ్వాస ఇస్తూ తీసుకెళ్లాలి. అలాంటి సమయంలోనూ మత్తు డాక్టర్లు కీలకంగా ఉంటారు. కరోనా రోగులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చేవారికి కృత్రిమ శ్వాస అందించేది వీరే. మత్తు డాక్టర్లది ముఖ్యపాత్ర జీవనశైలి జబ్బులు పెరగడంతో అత్యవసర వైద్యం తప్పనిసరైంది. దీంతో గత దశాబ్దంలో మత్తు డాక్టర్లు కీలకంగా మారారు. దానికి తోడు కోవిడ్ అత్యవసర చికిత్సలో వారి పాత్ర బాగా పెరిగింది. మత్తు వైద్యుల కొరత వల్ల వారిపై అదనపు బాధ్యతల భారం పెరిగింది. ఇన్ని బాధ్యతలు పెరిగినప్పటికీ వారి విభాగం పేరును మారుతున్న కాలాన్ని బట్టి మార్చకపోవడంతో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం లేదు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ సీపీఆర్‌లో ఇది కీలకం.. కోవిడ్ మొదట్లో చాలామంది ఆసుపత్రిలో చేరే లోపలే ప్రాణాలు వదిలారు. దీనికి ప్రధాన కారణం.. గడ్డలు ఏర్పడి రక్త ప్రసరణకు ఆటం కం కలగడం, ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఆకస్మికంగా గుండె ఆగిపోవడం. అటువంటి వారికి సీపీఆర్ చాలా ముఖ్యం. ఈ సేవలు మెరుగవడంతో ఆకస్మిక మరణాలు తగ్గాయి. ఈ విషయంలో మత్తు డాక్టర్లు కీలకపాత్ర పోషించారు. – డాక్టర్ చక్రరావు, మత్తు డాక్టర్ కరోనా కాలంలో 80 వేల సిజేరియన్లు కరోనా సమయంలో రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. వారిలో దాదాపు వెయ్యి మంది వరకు కరోనాతో ఉండగా సిజేరియన్లు జరిగాయని అంచనా. వారందరికీ మత్తు మందు ఇవ్వడం, కోవిడ్ గర్భిణులను క్రిటికల్ కేర్‌లో చూసుకోవడంలో మత్తు డాక్టర్లు పనిచేశారు. అయితే మత్తు వైద్యుల కొరత కారణంగా వారిపై మరింత ఒత్తిడి పెరిగింది. -
క్రిటికల్ కేర్ యూనిట్లలో అనెస్తెటిస్ట్‌ల పాత్ర కీలకం
– ఐఎస్ఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు కర్నూలు(హాస్పిటల్): ట్రామాకేర్ యూనిట్లు, క్రిటికల్ కేర్ యూనిట్లలో మత్తు మందు వైద్యుల (అనెస్తెటిస్ట్) పాత్ర కీలకమని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తెషియాలజిస్ట్స్(ఐఎస్ఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు అన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు శనివారం స్థానిక వెంకటరమణ కాలనీలోని తనిష్క కన్వెన్షన్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాయంత్రం వరకు పలు సైంటిఫిక్ అంశాలపై నిష్ణాతులైన వైద్యనిపుణులచే సెమినార్లు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు మాట్లాడుతూ ఐఎస్ఏ తరుపున అనెస్తెషియా పీజీ వైద్యవిద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. టెక్నికల్ ట్రై నింగ్‌కు పీజీలను పంపించి, వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచాల్సి ఉందన్నారు. దేశంలో 23వేల మంది అనెస్తెటిస్ట్‌లు ఉన్నారని, ప్రతి సంవత్సరం 2,500 మంది వైద్యులు బయటకు వస్తున్నారని తెలిపారు. వీరందరిలో నైపుణ్యాలు పెంచడమే ఐఎస్ఏ ముందున్న లక్ష్యమని చెప్పారు. వైద్యులు కనీసం వారానికి రెండు సార్లు పెయిన్ క్లినిక్‌లు నిర్వహించాలన్నారు. – గౌరవ అతిథి కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ సాధారణ ఆపరేషన్ థియేటర్ నుంచి మాడ్యులర్ ఓటీ స్థాయికి అనెస్తెషియా విభాగం అభివృద్ధి చెందిందన్నారు. శుక్రవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లు పీజీ వైద్యులకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మాతాశిశు సంరక్షణలోనూ మత్తు మందు వైద్యులు తమ వంతు సేవలందించాలని, వీరి సేవలు గ్రామీణ, తాలూకా స్థాయికి విస్తరించాలని సూచించారు. ఇందుకోసం పారామెడికల్, నర్సింగ్ వృత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లాలో ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్లు ఉన్నాయని, ఇవి ఇంకా విస్తరించాలన్నారు. – కార్యక్రమంలో ఐఎస్ఏ ఎలెక్టెడ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బిబి మిశ్రా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కేఎం వెంకటగిరి, కోశాధికారి డాక్టర్ అబ్దుల్ హమీద్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఎన్వి వేణుగోపాల్, కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం. ఉమామహేశ్వర్, కార్యదర్శి డాక్టర్ జి. శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డివి రామశివనాయక్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ దమమ్ శ్రీనివాసులు, అనెస్తెషియా వైద్యులు కళ్యాణ్, కిరణ్, విష్ణుబాబు, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.