సాక్షి, హైదరాబాద్: కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రతి ఒక్కరూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. చేసూ్తనే ఉన్నారు. కాకపోతే... మన దృష్టికి అంతగా రానిది కరోనా చికిత్సలో మత్తు డాక్టర్ల (అనస్థీషియన్ల) పాత్ర. క్రిటికల్ కేర్‌లో కీలక భూమిక పోషించే మత్తు డాక్టర్లకు సాధారణ వైద్యులతో పోలిస్తే మూడురెట్లు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారు కరోనా చికిత్సల్లో రోగులకు అత్యంత దగ్గరగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆ సంస్థ తన అనుబంధ జర్నల్ ‘అనస్థీషియా పెయిన్ అండ్ ఇంటెన్సివ్ కేర్’లో కరోనా కథ ముగిసే నాటికి అంతర్జాతీయ సమాజం మత్తు వైద్యులను రియల్ హీరోలుగా గుర్తిస్తుందని చెప్పింది. మన దేశంలో ఇప్పటివరకు 30 మంది మత్తు వైద్యులు కరోనాతో చనిపోయారు. అంటే ప్రతీ 10 వేల మంది మత్తు వైద్యులకు ఆరుగురు కరోనాతో చనిపోయారని కేంద్రం వెల్లడించింది. ఇది సామాన్య కరోనా మరణాల రేటుతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. సాధారణ వైద్యులతో పోలిస్తే వీరికి మూడు రెట్లు ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది.
క్రిటికల్ కేర్‌లో కీలకం
కోవిడ్‌పై ఏప్రిల్‌లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐసీయూ నిర్వహణలో ఐదుగురు వైద్యులను భాగస్వామ్యం చేసింది. అందులో మత్తు వైద్యులను మొదటి వరుసలో నిలిపింది. వీరితో పాటు జనరల్ మెడిసిన్, చెస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్‌లు అందులో ఉన్నాయి. కరోనా కాలంలో ఎవరైనా అత్యవసర వైద్యం కోసం వస్తే కృత్రిమ శ్వాస అంది స్తారు. రికవరీ అయ్యే వరకు చికిత్స అందించడంలో ఇతరులతో కలిసి మత్తు డాక్టర్లు పనిచేస్తారు. దీంతో రోగులకు అత్యంత దగ్గరగా ఉండాల్సి వస్తుంది. రోగికి వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటే... మత్తు వైద్యులకు అధిక ప్రమాదం పొంచి ఉంటుంది. కరోనా సీరియస్ రోగులకు సీటీస్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు కృత్రిమ శ్వాస ఇస్తూ తీసుకెళ్లాలి. అలాంటి సమయంలోనూ మత్తు డాక్టర్లు కీలకంగా ఉంటారు. కరోనా రోగులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చేవారికి కృత్రిమ శ్వాస అందించేది వీరే.
మత్తు డాక్టర్లది ముఖ్యపాత్ర
జీవనశైలి జబ్బులు పెరగడంతో అత్యవసర వైద్యం తప్పనిసరైంది. దీంతో గత దశాబ్దంలో మత్తు డాక్టర్లు కీలకంగా మారారు. దానికి తోడు కోవిడ్ అత్యవసర చికిత్సలో వారి పాత్ర బాగా పెరిగింది. మత్తు వైద్యుల కొరత వల్ల వారిపై అదనపు బాధ్యతల భారం పెరిగింది. ఇన్ని బాధ్యతలు పెరిగినప్పటికీ వారి విభాగం పేరును మారుతున్న కాలాన్ని బట్టి మార్చకపోవడంతో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం లేదు.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
సీపీఆర్‌లో ఇది కీలకం..
కోవిడ్ మొదట్లో చాలామంది ఆసుపత్రిలో చేరే లోపలే ప్రాణాలు వదిలారు. దీనికి ప్రధాన కారణం.. గడ్డలు ఏర్పడి రక్త ప్రసరణకు ఆటం కం కలగడం, ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఆకస్మికంగా గుండె ఆగిపోవడం. అటువంటి వారికి సీపీఆర్ చాలా ముఖ్యం. ఈ సేవలు మెరుగవడంతో ఆకస్మిక మరణాలు తగ్గాయి. ఈ విషయంలో మత్తు డాక్టర్లు కీలకపాత్ర పోషించారు.
– డాక్టర్ చక్రరావు, మత్తు డాక్టర్
కరోనా కాలంలో 80 వేల సిజేరియన్లు
కరోనా సమయంలో రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. వారిలో దాదాపు వెయ్యి మంది వరకు కరోనాతో ఉండగా సిజేరియన్లు జరిగాయని అంచనా. వారందరికీ మత్తు మందు ఇవ్వడం, కోవిడ్ గర్భిణులను క్రిటికల్ కేర్‌లో చూసుకోవడంలో మత్తు డాక్టర్లు పనిచేశారు. అయితే మత్తు వైద్యుల కొరత కారణంగా వారిపై మరింత ఒత్తిడి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment