Cesareans
-
రాష్ట్రంలోనే కడుపు ‘కోత’లెక్కువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమ్మకు కడుపు ‘కోత’తప్పడంలేదు! దేశంలోకెల్లా తెలంగాణలోనే సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం 2021–22లో సిజేరియన్ల జాతీయ సగటు 23.29 శాతంగా ఉండగా రాష్ట్రంలో అది ఏకంగా 54.09 శాతంగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం. అయితే తెలంగాణకన్నా ఎంతో వెనుకబడిన బిహార్‌లో మాత్రం అత్యంత తక్కువగా 5.66 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఆ తర్వాత జార్ఖండ్‌లో 9.13 శాతం, యూపీలో 9.51 శాతం, మధ్యప్రదేశ్‌లో 12.97 శాతం సిజేరియన్లు మాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ తరహాలో జమ్మూకశీ్మర్‌లో 48.97 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా పదో స్థానంలో నిలిచింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10 శాతం నుంచి 15 శాతానికి మించకూడదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో అంతకు ఐదు రెట్లు ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి. ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల జాతీయ సగటు 15.48 శాతం ఉండగా ప్రైవేటులో అది 37.95 శాతం ఉంది. ♦ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 47.13 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ♦ బిహార్‌లో అత్యంత తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.86 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ♦ 2021–22లో పుట్టిన శిశువుల్లో వివిధ కారణాల వల్ల తెలంగాణలో 2,171 మంది చనిపోయారు. ♦బాలికలకు శానిటరీ నాప్కిన్స్ సరఫరాలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా ఆ ఏడాది 4.21 కోట్లు సరఫరా చేయగా, అత్యధికంగా తమిళనాడులో కోటిన్నర, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1.16 కోట్లు సరఫరా చేశారు. తెలంగాణలో కేవలం 1,552 మాత్రమే సరఫరా చేశారు. ♦ 2021–22లో తెలంగాణలో 6.06 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో రెండున్నర కేజీల బరువుతో పుట్టినవారు 37,792 మంది ఉన్నారు. 4.89 లక్షల మంది గంటలోపు తల్లిపాలు తాగారు. ♦ 2021–22లోతెలంగాణలో 46.70 లక్షల కండోమ్‌లు పంపిణీ అయ్యాయి. -
కడుపు కోయకుండా కాన్పు చేయరు!
సాక్షి, హైదరాబాద్: అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరియన్ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయడంలేదు. రాష్ట్రంలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 తెలిపింది. ఈ మేరకు తాజాగా 31 జిల్లాల వారీగా సర్వే వివరాలను వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 27.2 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైతే కరీంనగర్ జిల్లాలో ఏకంగా 92.8 శాతం సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 65.8 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతుండగా, అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.6 శాతం జరుగుతున్నాయి. పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం.. రాష్ట్ర ప్రజలను జీవనశైలి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి రోగాలతో హైదరాబాద్ ప్రజలు సతమతమవుతున్నారు. షుగర్ వ్యాధితో హైదరాబాద్‌లో 26.8 శాతం మంది పురుషులు బాధపడుతుండగా, మహిళల్లో 21.2 శాతం మంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. అత్యంత తక్కువగా కొమ్రంభీం జిల్లాలో పురుషులు 11.6 శాతం, మహిళలు 8.4 శాతం మంది షుగర్ వ్యాధికి గురయ్యారు. అధిక రక్తపోటుతోనూ హైదరాబాద్ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక్కడి పురుషుల్లో 41.7 శాతం మంది, మహిళల్లో 30.2 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. అత్యంత తక్కువగా నల్లగొండ జిల్లాలో పురుషులు 25.7 శాతం, మహిళలు 19.6 శాతం మంది బీపీకి గురయ్యారు. ఇక రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లోనూ ఊబకాయం పెరుగుతోంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.4 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలో 5.5 శాతం, హైదరాబాద్ పిల్లల్లో 4.3 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 3.7 శాతం, ఆదిలాబాద్‌లో 2.9 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 1.4 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 1.2 శాతం, మెదక్ జిల్లాలో 1.1 శాతం, వికారాబాద్ జిల్లాలో 0.8 శాతం పిల్లల్లో ఊబకాయం సమస్య ఉంది. -
మత్తు డాక్టర్లకు... మస్తు 'రిస్క్'
సాక్షి, హైదరాబాద్: కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ప్రతి ఒక్కరూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. చేసూ్తనే ఉన్నారు. కాకపోతే... మన దృష్టికి అంతగా రానిది కరోనా చికిత్సలో మత్తు డాక్టర్ల (అనస్థీషియన్ల) పాత్ర. క్రిటికల్ కేర్‌లో కీలక భూమిక పోషించే మత్తు డాక్టర్లకు సాధారణ వైద్యులతో పోలిస్తే మూడురెట్లు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వారు కరోనా చికిత్సల్లో రోగులకు అత్యంత దగ్గరగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆ సంస్థ తన అనుబంధ జర్నల్ ‘అనస్థీషియా పెయిన్ అండ్ ఇంటెన్సివ్ కేర్’లో కరోనా కథ ముగిసే నాటికి అంతర్జాతీయ సమాజం మత్తు వైద్యులను రియల్ హీరోలుగా గుర్తిస్తుందని చెప్పింది. మన దేశంలో ఇప్పటివరకు 30 మంది మత్తు వైద్యులు కరోనాతో చనిపోయారు. అంటే ప్రతీ 10 వేల మంది మత్తు వైద్యులకు ఆరుగురు కరోనాతో చనిపోయారని కేంద్రం వెల్లడించింది. ఇది సామాన్య కరోనా మరణాల రేటుతో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. సాధారణ వైద్యులతో పోలిస్తే వీరికి మూడు రెట్లు ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది. క్రిటికల్ కేర్‌లో కీలకం కోవిడ్‌పై ఏప్రిల్‌లో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఐసీయూ నిర్వహణలో ఐదుగురు వైద్యులను భాగస్వామ్యం చేసింది. అందులో మత్తు వైద్యులను మొదటి వరుసలో నిలిపింది. వీరితో పాటు జనరల్ మెడిసిన్, చెస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్లు అందులో ఉన్నాయి. కరోనా కాలంలో ఎవరైనా అత్యవసర వైద్యం కోసం వస్తే కృత్రిమ శ్వాస అంది స్తారు. రికవరీ అయ్యే వరకు చికిత్స అందించడంలో ఇతరులతో కలిసి మత్తు డాక్టర్లు పనిచేస్తారు. దీంతో రోగులకు అత్యంత దగ్గరగా ఉండాల్సి వస్తుంది. రోగికి వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటే... మత్తు వైద్యులకు అధిక ప్రమాదం పొంచి ఉంటుంది. కరోనా సీరియస్ రోగులకు సీటీస్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు కృత్రిమ శ్వాస ఇస్తూ తీసుకెళ్లాలి. అలాంటి సమయంలోనూ మత్తు డాక్టర్లు కీలకంగా ఉంటారు. కరోనా రోగులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వచ్చేవారికి కృత్రిమ శ్వాస అందించేది వీరే. మత్తు డాక్టర్లది ముఖ్యపాత్ర జీవనశైలి జబ్బులు పెరగడంతో అత్యవసర వైద్యం తప్పనిసరైంది. దీంతో గత దశాబ్దంలో మత్తు డాక్టర్లు కీలకంగా మారారు. దానికి తోడు కోవిడ్ అత్యవసర చికిత్సలో వారి పాత్ర బాగా పెరిగింది. మత్తు వైద్యుల కొరత వల్ల వారిపై అదనపు బాధ్యతల భారం పెరిగింది. ఇన్ని బాధ్యతలు పెరిగినప్పటికీ వారి విభాగం పేరును మారుతున్న కాలాన్ని బట్టి మార్చకపోవడంతో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం లేదు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ సీపీఆర్‌లో ఇది కీలకం.. కోవిడ్ మొదట్లో చాలామంది ఆసుపత్రిలో చేరే లోపలే ప్రాణాలు వదిలారు. దీనికి ప్రధాన కారణం.. గడ్డలు ఏర్పడి రక్త ప్రసరణకు ఆటం కం కలగడం, ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ఆకస్మికంగా గుండె ఆగిపోవడం. అటువంటి వారికి సీపీఆర్ చాలా ముఖ్యం. ఈ సేవలు మెరుగవడంతో ఆకస్మిక మరణాలు తగ్గాయి. ఈ విషయంలో మత్తు డాక్టర్లు కీలకపాత్ర పోషించారు. – డాక్టర్ చక్రరావు, మత్తు డాక్టర్ కరోనా కాలంలో 80 వేల సిజేరియన్లు కరోనా సమయంలో రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. వారిలో దాదాపు వెయ్యి మంది వరకు కరోనాతో ఉండగా సిజేరియన్లు జరిగాయని అంచనా. వారందరికీ మత్తు మందు ఇవ్వడం, కోవిడ్ గర్భిణులను క్రిటికల్ కేర్‌లో చూసుకోవడంలో మత్తు డాక్టర్లు పనిచేశారు. అయితే మత్తు వైద్యుల కొరత కారణంగా వారిపై మరింత ఒత్తిడి పెరిగింది. -
ముహూర్తం చూసి మరీ కోయమంటున్నారు..
బిడ్డ పుట్టాక ముహూర్తం చూడడం ఒకప్పటి పద్ధతి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ముందుగానే ముహూర్తం చూసుకుని మరీ బిడ్డను బలవంతంగా బయటకు తీసుకువస్తున్నారు. అమ్మ కడుపులో నుంచి ఎప్పుడు బయటకు రావాలో ఆ పసిప్రాణానికి ఎవరూ చెప్పనక్కర్లేదు. సహజ రీతిలో జరిగే ప్రక్రియ ద్వారా అమ్మను ఏడిపించి మరీ బిడ్డ బయటకు వస్తుంది. ఇలా రావడం ద్వారా తల్లిని ఏడిపించినా జన్మంతా అమ్మకు ఎన్నో విధాల మేలు చేస్తుంది. కానీ బిడ్డకు ఆ స్వేచ్ఛనివ్వకుండా బలవంతాన బయటకు తీస్తున్నారు. ఎప్పుడో విషమ పరిస్థితుల్లో వినియోగించాల్సిన ‘సిజేరియన్’ అస్త్రాన్ని అవసరానికి మించి వాడుతున్నారు. యుక్తి మరిచి కత్తిని వినియోగిస్తున్నారు. ఫలితంగా అమ్మ బతుకు ప్రమాదంలో పడుతోంది. కోతల కారణంగా జీవితమంతా తల్లి శరీరం మూల్యం చెల్లించుకుంటూనే ఉంటుంది. వజ్రపుకొత్తూరు : సిజేరియన్.. ఒకప్పుడు గర్భిణులంతా భయపడిన పదం. కానీ ఇప్పుడు అదే పదం మాటిమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లోనే ఇది వరకు ఆపరేషన్ చేసేవారు. కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా కత్తి వాడుతున్నారు. కత్తి గాటు పడనిదే బిడ్డ బయటకు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. సహజ కాన్పులో వేదన తప్ప ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా ఈ పద్ధతికే ఓటేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మారు మూల పల్లె వాసులు కూడా ఆపరేషన్‌కే వెళ్తుండడం గమనార్హం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 40 శాతం వరకు సిజేరియన్ చికిత్సలే ఉంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. ముహూర్తం పెట్టుకుని మరీ.. సిజేరియన్లపై జిల్లా వాసులు ఎంతగా మక్కువ చూపుతున్నారంటే.. ఆపరేషన్లకు ముందుగానే ముహూర్తం పెట్టుకుని మరీ వస్తున్నారు. అంటే ప్రసవానికి ముందే వారు ఆపరేషన్‌కు ఫిక్సైపోతున్నారు. వారే అలా సిద్ధమయ్యే సరికి డాక్టర్లదేముంది. వారికి సర్ది చెప్పే మాట అటుంచి చాలా మంది ఆపరేషన్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. కొందరు డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనం మాత్రం విని పించుకోవడం లేదు. సిజేరియన్తో ఇవీ ఇబ్బందులు.. సహజ ప్రసవ సమయంలో ప్రొలాక్టిన్ వంటి హార్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పిత్తి జరుగుతుంది. అదే సిజేరియన్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది. ముర్రుపాలు పట్టకపోతే అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. సిజేరియన్ సమయంలో మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. శస్త్ర చికిత్స జరిగితే కొన్ని రోజుల వరకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయి. బాలింతలు రోజల తరబడి మంచానికి అతుక్కుపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమ్యలు వస్తాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకుంటాయి. ఎన్నెన్నో కారణాలు.. ఆహారపు అలవాట్లలో మార్పు రావ డం, బయటి తిళ్లు ఎక్కువగా తీసుకో వడం వంటివి సైతం గర్భిణుల ఆరో గ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. వ్యాయామ లేమి, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి కారణాల వల్ల గర్భం దాల్చినప్పటి నుంచి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రక్తపోటు, చక్కెర శాతం పెరగడం, థైరాయిడ్ వంటి అనారోగ్య ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉండే మహిళలకు సిజేరియన్ చేస్తున్నారు. ఇదీ వ్యాపారమే.. ఒక శస్త్ర చికిత్సకు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల వారు సుమారు రూ.30వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ఓ మేజర్ ఆపరేషన్‌కు తీసుకున్నంత మొత్తంలో ఉంటోంది. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 50 నుంచి 90 వరకు వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. వీటిలో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటాయి. సహజ ప్రసవం జరిగితే తల్లీ బిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చును. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇది ఒక వ్యాపారంగా మారి పోవడంతో సంపాదనే పరమావధిగా తయారైంది. సహజ ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో స్థాయిని బట్టి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. అదే సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజులు వరకు ఉండాలి. ఆస్పత్రి స్థాయిని బట్టి ఖర్చు రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు చార్జి చేస్తుండడం విశేషం. ఇంత ఖర్చుకు కూడా కుటుంబ సభ్యులు వెనుకాడడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ.. సిజేరియన్లు చేయడంలో ప్ర భుత్వ ఆస్పత్రులతో పోల్చి తే ప్రైవేటు ఆస్పత్రుల వారు అధికంగా ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు మాత్రం సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ బయట ఆస్పత్రుల్లో అవగాహన కల్పించకుండానే కోత కోస్తున్నారు. ఇటీవల కాలం లో వీటిపై న్యాయ పరమైన చిక్కులు కూడా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బిడ్డ చనిపోవడమో, తల్లి మృత్యువాత పడడమో జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో వైద్యుల నిర్లక్ష్యం అంటూ రోడ్డుపై బైఠాయింపులు, కోర్టులకు వెళ్లడాలు వంటివి రోగులు చేస్తున్నారు. బిడ్డపైనా ప్రభావం ఇలా.. బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. అసహజ రీతిలో శస్త్రచికిత్స ద్వారా బిడ్డ జననం జరిగితే కొన్ని ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కత్తిగాట్ల వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పం దనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువగాను లేదా తక్కువగాను విడుదలై అవి భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. సిజేరియన్ ఎప్పుడు చేస్తారు..? గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం. గర్భాశయ ముఖ ద్వారాన్ని మాయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లో సిజేరియన్లు చేస్తారు. తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తారు. అవసరమైతేనే చేయాలి.. సిజేరియన్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాలి. అందులో గర్భిణి ఆరోగ్య స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే సహజ ప్రసవం కోసం ఎదురు చూడా లి. ద్వారం చిన్నగా ఉండడం, ఎదురు కాన్పు సమయాల్లో ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం లేమి వంటి కారణాలు ఉన్నాయి. బీపీ, సుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు కొంత మేర సిజేరియన్‌కు కారణం కావచ్చు. ఇవి 1000 మందిలో ఒకరి ఉంటుంది. సిజేరియన్‌లో ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానం అమలులో ఉంది. అయితే సిజేరియన్ల విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – డాక్టర్ కె. లీల, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ, వైద్య ఆరోగ్య శాఖ -
కొన్నిసార్లు సిజేరియన్లు అనివార్యం
మాతా శిశువుల దీర్ఘకాల ప్రయోజనాలు ముఖ్యం - దేశంలో కోత కాన్పులు 17 శాతమే - అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సులో వక్తలు సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో సిజేరియన్లు పెరగడం భారత్‌కే పరిమితం కాదని, అనేక కారణాల రీత్యా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు గైనకాలజిస్టులు అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, గర్భధారణలు అధిక వయసులో జరగడం, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో కొన్నిసార్లు ఇవి అనివార్యమవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో మాతాశిశు సంక్షేమం, నవజాత శిశువుల ఆరోగ్యంపై అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సు ‘ఫాగ్సీ – ఫీగో – 2017 ప్రారంభమైంది. అనేక దేశాలకు చెందిన దాదాపు 1,500 మంది గైనకాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు. భారత్‌లో మొత్తం కాన్పుల్లో దాదాపు 17 శాతమే సిజేరియన్లు అని ఫాగ్సీ –ఫీగో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.శాంతకుమారి చెప్పారు. దక్షిణ అమెరికాకు చెందిన బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో సమస్య మరింత జటిలమవుతోందని ఆమె వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తగురీతిలో స్పందించకపోతే అత్యవసర సేవలను నిలిపివేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. సంతానలేమి పెరుగుతోంది: రిష్మా ధిల్లోన్ పై దేశంలో ఏటికేటికీ సంతాన లేమి సమస్య పెరుగుతోందని ఫాగ్సీ అధ్యక్షురాలు రిష్మా ధిల్లోన్ పై తెలిపారు. గడచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, కాలుష్యం తదితరాలు దీనికి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతినెలా 9న గర్భిణులకు ఉచిత సేవలు అందించేందుకు గైనకాలజిస్టులు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. సురక్షితమైన కాన్పుల సంఖ్యను మరింతగా పెంచేందుకు నర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మొత్తం పది లక్షల మందికి శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యమని సంస్థ కార్యదర్శి డాక్టర్ హేమా దివాకర్ తెలిపారు. వైద్యులను నమ్మాలి: ప్రొఫెసర్ సీఎన్ పురందరే సిజేరియన్ల విషయంలో గైనకాలజిస్టులపై విమర్శలు వస్తున్నాయని, అయితే కొందరు తప్పితే చాలామంది డాక్టర్లు తమ శక్తి మేరకు తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రయత్నిస్తుంటారని ఫీగో చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్ పురందరే స్పష్టం చేశారు. గర్భిణుల్లో 17 నుంచి 19 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటున్నారని, సహజ కాన్పు వద్దని సిజేరియన్లే కావాలని కోరేవారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు.