సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమ్మకు కడుపు ‘కోత’తప్పడంలేదు! దేశంలోకెల్లా తెలంగాణలోనే సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం 2021–22లో సిజేరియన్ల జాతీయ సగటు 23.29 శాతంగా ఉండగా రాష్ట్రంలో అది ఏకంగా 54.09 శాతంగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం.
అయితే తెలంగాణకన్నా ఎంతో వెనుకబడిన బిహార్‌లో మాత్రం అత్యంత తక్కువగా 5.66 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఆ తర్వాత జార్ఖండ్‌లో 9.13 శాతం, యూపీలో 9.51 శాతం, మధ్యప్రదేశ్‌లో 12.97 శాతం సిజేరియన్లు మాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ తరహాలో జమ్మూకశీ్మర్‌లో 48.97 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా పదో స్థానంలో నిలిచింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచనల ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10 శాతం నుంచి 15 శాతానికి మించకూడదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో అంతకు ఐదు రెట్లు ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి.
♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల జాతీయ సగటు 15.48 శాతం ఉండగా ప్రైవేటులో అది 37.95 శాతం ఉంది.
♦ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 47.13 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి.
♦ బిహార్‌లో అత్యంత తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.86 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి.
♦ 2021–22లో పుట్టిన శిశువుల్లో వివిధ కారణాల వల్ల తెలంగాణలో 2,171 మంది చనిపోయారు.
♦బాలికలకు శానిటరీ నాప్కిన్స్ సరఫరాలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా ఆ ఏడాది 4.21 కోట్లు సరఫరా చేయగా, అత్యధికంగా తమిళనాడులో కోటిన్నర, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1.16 కోట్లు సరఫరా చేశారు. తెలంగాణలో కేవలం 1,552 మాత్రమే సరఫరా చేశారు.
♦ 2021–22లో తెలంగాణలో 6.06 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో రెండున్నర కేజీల బరువుతో పుట్టినవారు 37,792 మంది ఉన్నారు. 4.89 లక్షల మంది గంటలోపు తల్లిపాలు తాగారు.
♦ 2021–22లోతెలంగాణలో 46.70 లక్షల కండోమ్‌లు పంపిణీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment