జోహన్నెస్బర్గ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ‍్ల్యూహెచ్ఓ) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన చేసింది.
డబ‍్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయితే.. కరోనా పీక్ స్టేజ్ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే, అది మన చేతిలోనే ఉందని తెలుపుతూ.. అందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
ఇదిలా ఉండగా.. ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సినేషన్పై టెడ్రోస్ అసంతృప్తి వ‍్యక్తంచేశారు. అక్కడ కేవలం 11శాతం మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడంతో టీకా పంపిణీపై డబ‍్ల్యూహెచ్ఓ దృష్టి సారించనున్నట్టు అథనమ్ వెల్లడించారు. అయితే, మోడెర్నా సీక్వెన్స్ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ టీకాను రూపొందించిన ఆఫ్రిజెన్ బయెలాజిక్స్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. డబ‍్ల్యూహెచ్ఓ, కోవాక్స్ సహకారంలో ఆఫ్రిజెన్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే 2024లో ఆఫ్రిజెన్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అథనమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment