క్రిటికల్ కేర్ యూనిట్లలో అనెస్తెటిస్ట్‌ల పాత్ర కీలకం
క్రిటికల్ కేర్ యూనిట్లలో అనెస్తెటిస్ట్‌ల పాత్ర కీలకం
Published Sat, Sep 17 2016 9:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
– ఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు
కర్నూలు(హాస్పిటల్): ట్రామాకేర్ యూనిట్లు, క్రిటికల్ కేర్ యూనిట్లలో మత్తు మందు వైద్యుల (అనెస్తెటిస్ట్) పాత్ర కీలకమని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తెషియాలజిస్ట్స్(ఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు అన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తీషియాలజిస్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు శనివారం స్థానిక వెంకటరమణ కాలనీలోని తనిష్క కన్వెన్షన్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాయంత్రం వరకు పలు సైంటిఫిక్ అంశాలపై నిష్ణాతులైన వైద్యనిపుణులచే సెమినార్లు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు మాట్లాడుతూ ఐఎస్‌ఏ తరుపున అనెస్తెషియా పీజీ వైద్యవిద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. టెక్నికల్ ట్రై నింగ్‌కు పీజీలను పంపించి, వారిలో వృత్తి నైపుణ్యాలను పెంచాల్సి ఉందన్నారు. దేశంలో 23వేల మంది అనెస్తెటిస్ట్‌లు ఉన్నారని, ప్రతి సంవత్సరం 2,500 మంది వైద్యులు బయటకు వస్తున్నారని తెలిపారు. వీరందరిలో నైపుణ్యాలు పెంచడమే ఐఎస్‌ఏ ముందున్న లక్ష్యమని చెప్పారు. వైద్యులు కనీసం వారానికి రెండు సార్లు పెయిన్ క్లినిక్‌లు నిర్వహించాలన్నారు.
– గౌరవ అతిథి కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ సాధారణ ఆపరేషన్ థియేటర్ నుంచి మాడ్యులర్ ఓటీ స్థాయికి అనెస్తెషియా విభాగం అభివృద్ధి చెందిందన్నారు. శుక్రవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లు పీజీ వైద్యులకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మాతాశిశు సంరక్షణలోనూ మత్తు మందు వైద్యులు తమ వంతు సేవలందించాలని, వీరి సేవలు గ్రామీణ, తాలూకా స్థాయికి విస్తరించాలని సూచించారు. ఇందుకోసం పారామెడికల్, నర్సింగ్ వృత్తి నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లాలో ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్లు ఉన్నాయని, ఇవి ఇంకా విస్తరించాలన్నారు.
– కార్యక్రమంలో ఐఎస్‌ఏ ఎలెక్టెడ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బిబి మిశ్రా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కేఎం వెంకటగిరి, కోశాధికారి డాక్టర్ అబ్దుల్ హమీద్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ఎన్‌వి వేణుగోపాల్, కార్యక్రమ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎం. ఉమామహేశ్వర్, కార్యదర్శి డాక్టర్ జి. శాంతిరాజు, కోశాధికారి డాక్టర్ డివి రామశివనాయక్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ దమమ్ శ్రీనివాసులు, అనెస్తెషియా వైద్యులు కళ్యాణ్, కిరణ్, విష్ణుబాబు, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement