సామాన్యుడు కోర్టుకు రాకూడదా? సీబీఐ దర్యాప్తు కోరకూడదా? | The High Court questioned the State Govt | Sakshi
Sakshi News home page

సామాన్యుడు కోర్టుకు రాకూడదా? సీబీఐ దర్యాప్తు కోరకూడదా?

Published Thu, Aug 15 2024 6:10 AM | Last Updated on Thu, Aug 15 2024 12:58 PM

The High Court questioned the State Govt

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. సీఎం చంద్రబాబు తదితరులపై కేసులు సీబీఐకి బదలాయింపుపై కౌంటర్‌కు ఆదేశం

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 11కి వాయిదా

ఈ కేసుల్లో దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలి

నిందితుడు తనపై ఉన్న కేసులను తానే సమీక్షించడం ఆందోళనకరం

కేసు రహస్య డాక్యుమెంట్లను పరిశీలించి ప్రయోజనం పొందే అవకాశం ఉంది

ప్రభుత్వం మారిన వెంటనే కక్ష సాధింపులు.. దర్యాప్తు అధికారుల బదిలీ

హైకోర్టుకు నివేదించిన పిటిషనర్‌ సీనియర్‌ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్‌

ఈ పిల్‌కు విచారణార్హతే లేదన్న  రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది.

ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సెపె్టంబర్‌ 11కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

నిష్పాక్షిక దర్యాప్తునకు ఆస్కారం లేదు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణం, అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలు తదితరాలకు సంబంధించి చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేనందున ఈ బాధ్యతను సీబీఐ, ఈడీలకు అప్పగించాలంటూ సీనియర్‌ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్‌ కొట్టి బాలగంగాధర తిలక్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై తాజాగా విచారణ సందర్భంగా పిటిషనర్‌ సీనియర్‌ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు తదితరులపై నమోదైన 7 కేసుల్లో దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతున్నామన్నారు. 

ఈ కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నందున రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు పరిస్థితి లేదన్నారు. ఈ కేసుల్లో ఐపీఎస్‌ అధికారులు సంజయ్, కొల్లి రఘురామిరెడ్డి దర్యాప్తు చేసి ఇప్పటికే కోర్టులో చార్జిïÙట్లు దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం మారగానే ఈ ఇద్దరు అధికారులను దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించారని నివేదించారు. 

కేసులపై నిందితుడి స్వీయ సమీక్ష
గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసులన్నింటినీ సమీక్షిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత మీడియాతో  పేర్కొన్నారని శ్రీపాద కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ క్లిప్పింగ్‌లను ఆయన ధర్మాసనం ముందుంచారు. హోంమంత్రిని పక్కన పెడితే ముఖ్యమంత్రి స్వయంగా సీఐడీ కేసులను సమీక్షిస్తామని చెప్పడం ఆందోళన కలిగించే అంశమన్నారు. తను నిందితుడిగా ఉన్న కేసులను తానే సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చెప్పడం తదుపరి పరిణామాలను తెలియచేస్తోందన్నారు.

ఓ నిందితుడు తన కేసులను తానే సమీక్షిస్తాననడం ఇంతవరకు ఎక్కడా లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ కేసుల ఉపసంహరణ విషయంలో అంతిమంగా సంబంధిత పబ్లిక్‌ ప్రాసిక్యూటరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందిగా? అని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి ఇంకా రాలేదుగా? అని ప్రశ్నించింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి తన కేసులను తానే సమీక్షిస్తానని చెప్పడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని శ్రీపాద కోరారు. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఐదుగురు ముఖ్యమంత్రులు ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొన్నారని, అందులో పలువురిని సీబీఐ ప్రాసిక్యూట్‌ చేసిందన్నారు. ఆ కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు చేయలేదన్నారు. ఇప్పుడు నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమోదైన కేసుల తాలుకూ కీలక డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందన్నారు. రహస్య, అంతర్గత డాక్యుమెంట్లను సైతం చంద్రబాబు పరిశీలించే ఆస్కారం ఉందన్నారు. తద్వారా ఆయా కేసుల్లో తనకు ప్రయోజనం చేకూరేలా డిఫెన్స్‌ను సిద్ధం చేసుకుంటారని శ్రీపాద నివేదించారు. 



రాజకీయ కేసులు కాదు.. అవినీతి కేసులు 
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. అలా చేయకుండా ప్రభుత్వాన్ని తాము నియంత్రించగలమా? అని ప్రశ్నించింది. కీలక, రహస్య డాక్యుమెంట్లను చంద్రబాబుకు అందుబాటులో ఉంచకూడదనే తాము కోరుతున్నామని శ్రీపాద చెప్పారు. దానివల్ల కేసులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నా­రు. చంద్రబాబు తదితరులపై నమోదైనవి రాజ­కీయ కేసులు కాదని, రూ.వందల కోట్ల ప్రజా­ధనాన్ని దుర్వినియోగం చేసినందుకే కేసులు నమోదయ్యా­యని నివేదించారు.

ఈ కేసులన్నీ పూర్తిగా అవినీతికి సంబంధించినవన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభు­త్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ­వాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ అసలు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వచన పరిధిలోకి రాదన్నారు. పిటిషనర్‌ విశ్వసనీయతపై సందేహాలున్నాయన్నారు. పత్రిక నడుపుతున్నట్లు చెబుతు­న్న పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పత్రిక సర్కులేషన్‌ వివరాల­ను పొందుపరచలేదన్నారు. ఈ వ్యాజ్యంలో మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేర్చార­­న్నారు.

సీబీఐకి బదలాయించాలని కోరకూడదా..?
ఈ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంటూ.. పత్రిక నడుపుతున్న విష­యాన్ని పక్కన పెట్టండి. సామాన్యుడు కోర్టు­ను ఆశ్రయించకూడదా? కేసులను సీబీఐకి బదలాయించాలని కోరకూడదా? అని ప్రశ్నించింది. ఈ కేసులో పిటిషనర్‌ పూర్వాపరాలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యాజ్యాన్ని మొత్తం పత్రికా కథనాల ఆధారంగా దాఖలు చేశారని రోహత్గీ పేర్కొన్నారు. ఇద్దరు అధికారులను బది­లీ చేశారని చెబుతున్నారని, వాస్తవా­నికి బదిలీపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి సీబీఐతో దర్యాప్తు నిర్వహించాలనడం సరికాదన్నారు. ఇప్పటికే ఐదు కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙట్‌ దాఖ­లు చేశా­రని, రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అనంతరం ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విచారణార్హతపై అభ్యంతరాలుంటే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు­త్వాన్ని ఆదేశించింది. 

అందుకు మూడు వారాల సమయం ఇస్తామని పేర్కొంది. ముందు విచారణార్హతపై కౌంటర్‌ దాఖలు చేస్తామని, దానిని తేల్చిన తరువాత మిగిలిన విషయాల్లోకి వెళ్లవచ్చ­ని రాష్ట్ర ప్రభుత్వం తరఫునే హాజరవుతున్న అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రతిపాదించగా ధర్మాసనం తోసిపుచ్చి0ది. ముక్కలు ముక్కలుగా విచారణ చేయబోమన్న ధర్మాసనం.. విచారణార్హతతో పాటు పిటిషనర్‌ లేవనెత్తిన అన్ని అంశాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందేనని తేల్చి చెబుతూ విచారణను వాయిదా వేసి­ంది.

గొప్పగా దర్యాప్తు చేశారు.. అందుకే బదిలీ 
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆ 7 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు ఎప్పుడు నమోద­య్యాయి? చార్జిïÙట్లు  ఎప్పుడు దాఖలు చేశా­రు? అనే వివరాలను ఆరా తీసి నమోదు చేసుకుంది. కేసుల విషయంలో సంజయ్, రఘు­రామిరెడ్డి ఎంతో గొప్పగా తమ బాధ్యతలను నిర్వర్తించారని శ్రీ­పాద తెలిపారు. ప్రభుత్వం మారగానే కక్ష సాధింపులు మొదలయ్యాయని, అందుకు వీరి­ద్దరూ బలైపోయారన్నారు. 

మద్యం కుంభకోణానికి సంబంధించి చంద్రబాబుపై ఫిర్యా­దు చేసిన అప్పటి బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా కక్ష సాధింపులు మొదలయ్యా­యని ధర్మాసనం దృష్టికి తెచ్చా­రు. కారులో ఫైళ్లు తరలిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ను 20 నిమిషాల్లో మేజి్రస్టేట్‌కు పంపారన్నారు. ఒల­ంపిక్స్‌లో ఇలాంటి పోటీ­లు నిర్వహిస్తే ఆ పోలీ­సు అధికారికి కచ్చితంగా బంగారు పతకం దక్కేదని చమత్కరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement