‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’ | Allegations On Ongole Government Medical College Principal | Sakshi
Sakshi News home page

‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు..’

Dec 14 2022 3:16 PM | Updated on Dec 14 2022 3:16 PM

Allegations On Ongole Government Medical College Principal - Sakshi

రాష్ట్ర హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్‌ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా.. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్‌ హాజరైన దాఖలాలు లేవు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నేను మోనార్క్‌ని నన్నెవరూ మోసం చేయలేరు...’’ ఓ సినిమాలో డైలాగు. అదే మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ పనితనం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై ఇటు విద్యార్థులు.. అటు ఉద్యోగులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు సైతం వెళ్లాయి.

మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పట్లో స్థానిక మంత్రిని గాని, కలెక్టర్‌ను గాని, ఎంపీని కానీ ఆహా్వనించలేదు. ఇదేంటని వైద్య విద్యార్థులు ప్రశ్నిస్తే ‘‘మీకు సర్టిఫికెట్లు కావాలా... అతిథులు కావాలా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మెడికల్‌ కాలేజీకి సంబంధించిన మెస్‌ విషయంలోనూ ఈయన వ్యవహరించిన తీరుపై పెద్ద వివాదం జరిగింది. చివరకు కలెక్టర్‌ జోక్యంతో సద్దుమణిగింది.

వీడియో కాన్ఫరెన్స్‌లకు గైర్హాజరు
రాష్ట్ర హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రిన్సిపల్‌ తరచూ గైర్హాజరు అవుతుంటారు. కలెక్టర్, రాష్ట్ర స్థాయి అధికారుల వీడియో సమావేశాలైనా...వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జరిగితే ప్రిన్సిపల్‌ హాజరైన దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను చేపడితే దానిలో సైతం అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కానీ, ఇటు జీజీహెచ్‌ అధికారులకు కానీ సహకరించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఎనీమియా వ్యాధికి సంబంధించి సర్వే చేయాల్సి ఉండగా దానిపై ప్రొఫార్మా తయారు చేసే విషయంలోను ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులే తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించారు.

మహిళా ఉద్యోగి రాజీనామా... 
ప్రిన్సిపల్‌తో పాటు ఈయన అనుచరుల వేధింపుల దెబ్బకు ఒక మహిళా ఉద్యోగి తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రిన్సిపల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న మెడికల్‌ కాలేజీలో ఎల్రక్టీషియన్‌ కూడారి ఆంజనేయులు మహిళా ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె 2022 అక్టోబర్‌ 20న రిమ్స్‌ అవుట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంజనేయులుపై ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఆ విషయమై ప్రిన్సిపల్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతని అనుచరుడు కావటంతో చర్యలు తీసుకోలేదు. దీనిపై మనస్థాపం చెందిన మహిళా ఉద్యోగి రాజీనామా చేసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన అటెండర్లు ఆయనకు కనీసం ఆహారం కూడా అందించకూడదనే మౌఖిక ఆదేశాలు జారీ చేశాడంటే ఆ సామాజిక వర్గాల ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో ఉందో అర్థమవుతోంది.
చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ షాకింగ్‌ నిర్ణయం

బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు
రూల్‌ ఈజ్‌ రూల్‌...రూల్‌ ఫర్‌ ఆల్‌...కానీ ఈ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌కు మాత్రం కొన్ని మినహాయింపులు. విధి నిర్వహణకు వచ్చిన సమయంలో ఉద్యోగులందరూ బయో మెట్రిక్‌ ద్వారా హాజరు వేయాలి. కానీ ఈయనకు బయో మెట్రిక్‌ విధానం మినహాయింపు. ఆయన ఎప్పుడైనా రావచ్చు...వెళ్లిపోవచ్చు...అసలు రాకుండా కూడా ఉండవచ్చు. ఇదీ ఆయన తీరు.

ఆరోపణలన్నీ అవాస్తవమే.. 
నాపై వచ్చినవన్నీ నిరాధారమైన ఆరోపణలే. మహిళా ఉద్యోగి విషయంలో లేనిపోని రాజకీయాలు చేస్తున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే నేను పని చేస్తున్నాను. సెలవులు ఎవరైనా పెట్టుకోవచ్చు. గైర్హాజరైతేనే ఒప్పుకోను. 
– డాక్టర్‌ పీవీ సుధాకర్, జీఎంసీ ప్రిన్సిపాల్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement