సాక్షి, విశాఖపట్నం : దళితుడైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. సుధాకర్ మాటలపై అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని సుధాకర్ చెబుతుంటే.. అయ్యన్న మాత్రం ఆయనతో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సోమవారం ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. దళితుడైన సుధాకర్‌ను తమ రాజకీయం కోసం చంద్రబాబు, అయ్యన్నలు బలి చేశారని అన్నారు. ( ‘అయ్యన్న పాత్రుడి ఇంట్లోనే ఆయనకు తర్ఫీదు ఇచ్చారు’ )
చంద్రబాబు, అయ్యన్న కలిసి శాడిస్టుల్లా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ టీడీపీ కార్యాలయం వేదికగా ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌తో కలిసి అయ్యన్నపాత్రుడు కుట్ర చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందచేస్తున్న మొనగాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. ప్రజలు తమను మర్చిపోతారేమోనన్న భయంతో చంద్రబాబు, అయ్యన్నలు దళితులతో డ్రామాలాడించడం దళితులను మోసం చేయడమేనని అన్నారు. ( ‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’ )
కాగా, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, డాక్టర్ సుధాకర్ల మధ్య బంధాన్ని బైట పెట్టారు. అయ్యన్న పాత్రుడు గురించి డాక్టర్ సుధాకర్ మాట్లాడిన వీడియోను ఆయన వెలుగులోకి తెచ్చారు. ‘‘ నన్ను అయ్యన్నపాత్రుడు కుక్కలా వాడుకున్నాడు’’ అని సుధాకర్ మాట్లాడిన వీడియో అది.
Comments
Please login to add a commentAdd a comment