తాడేపల్లి రూరల్/మంగళగిరి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులపై చంద్రబాబు ఇంటి ఎదుట టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న తీసుకువచ్చిన మరికొందరు రౌడీలు రమేష్‌ను తోసివేసి.. కర్రలు, రాళ్లతో వీరంగం సృష్టించారు. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించడమే తప్పన్నట్లుగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
వారి అరాచకంతో శుక్రవారం ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఎంను బండబూతులు తిట్టిన అయ్యన్నపాత్రుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ జోగి రమేష్ తన అనుచరులతో కలసి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు.. రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని కిరాయి రౌడీలు, పార్టీ కార్యకర్తలతో అక్కడ మోహరించారు. చంద్రబాబు నివాసం వద్దకు జోగి రమేష్ కారు రాగానే మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్దా వెంకన్న, కొందరు కార్యకర్తలు, రౌడీషీటర్లు రెచ్చిపోయి ఆయన కారుపై దాడి చేశారు.
వెంటనే జోగి రమేష్ కిందకు దిగి తాను శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే, ఇదేం పని.. అని ప్రశ్నిస్తుండగా బుద్దా వెంకన్న జోగి రమేష్‌ను వెనక్కు నెట్టేశారు. ‘ఏంట్రా నా కొ.. మీరు మాట్లాడేది? మీ ముఖ్యమంత్రికి, మీకు చెమడాలు తీస్తాం. ఇక నుంచి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయం. ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ జెండా కర్రలతో దాడి చేశారు. వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు మీదకు వచ్చి రాళ్లు విసిరారు.
బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూ..
దాడి సమయంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సీఎం జగన్‌ను రాయలేని భాషలో బూతులు తిడుతూ కర్రలతో చెలరేగిపోయారు. తమ అనుకూల మీడియాలోనే బూతులు తిడుతూ కొందరు నేతలు లైవ్‌లో మాట్లాడడం గమనార్హం. దాడి చేస్తున్న టీడీపీ నేతల్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను సైతం వారు ఇష్టానుసారం దుర్భాషలాడారు.
ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి.. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను పోలీసులు తమ వాహనంలో రెండు కిలోమీటర్లు తీసుకెళ్లాక, టీడీపీ రాష్ట్ర నాయకుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం మళ్లీ దాడి చేశాడు. కాన్వాయ్‌ను ఆపి కారు డ్రైవర్‌ను కిందకు దిగరా అంటూ విచక్షణా రహితంగా కారు అద్దంపై చెప్పుతో కొట్టాడు. ఆ తర్వాత బండ రాయి తీసుకుని కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి యత్నించాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నించగా బండిపై పరారయ్యాడు.
ఇంట్లో నుంచి చంద్రబాబు డైరెక్షన్
టీడీపీ నేతలు జోగి రమేష్‌పై దాడి చేస్తున్న సమయంలో చంద్రబాబు ఇంట్లోనే ఉండి ఏం చేయాలో సూచించారు. దాడి విషయం టీవీల్లో వస్తుండడంతో తమపైనే దాడి జరిగిందని చిత్రీకరించేందుకు ఉన్నట్టుండి బుద్దా వెంకన్నను పక్కకు పంపి కింద పడిపోవాలని సూచించారు. దీంతో అప్పటి వరకు గొడవ చేస్తున్న ఆయన.. ఉన్నట్లుండి రోడ్డు పక్కన పడిపోయారు. ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే మళ్లీ లేచి మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు. గొడవ తర్వాత దాడి చేసిన వారంతా చంద్రబాబు నివాసం లోకి వెళ్లగా, ఆయన బయటకొచ్చి గట్టిగా బదులిచ్చారని అభినందించారు.
చంద్రబాబు పెద్ద గూండా
చంద్రబాబు ఒక పెద్ద గూండా అని ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్, డీజీపీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల దృష్టిలో దేవుడిగా మారిన వైఎస్ జగన్‌ను ఇష్టానుసారం మాట్లాడితే సహించే ప్రసక్తే లేదన్నారు. తిక్కతిక్క వేషాలు వేసినా, సీఎం జగన్‌పై తిక్కతిక్కగా మాట్లాడినా తాట తీస్తామని చెప్పారు.
అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు చంద్రబాబును రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. దాడిచేసిన వారిపై పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద తమపై దాడి చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మరికొందరు శుక్రవారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌తో పాటు సీఎం, డీజీపీలపై కూడా కేసులు నమోదు చేయాలని కోరినట్టు బుద్దా వెంకన్న తెలిపారు.
టీడీపీ నేత అయ్యన్నపై ఫిర్యాదు
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిపై విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ కొండా రమాదేవి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తలారి రాజేంద్ర కూడా తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్‌లో అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ గ్రంథాలయం వద్ద విద్యార్థులు అయ్యన్నపాత్రుడు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి.. కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారు. అయ్యన్నను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment