
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan) గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఆయన పర్యటన సందర్బంగా ఎక్కడా పోలీసులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ బుధవారం గుంటూరు(Guntur) మిర్చి యార్డులో రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్తున్న సమయంలో పోలీసుల సెక్యూరిటీ లేకపోవడంతో జనసందోహం మధ్యే ఆయన వారిని కలిశారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.
అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో పెద్దగా పోలీసులు ఎక్కడా కనిపించలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనను కలిసేందుకు మిర్చి యార్డ్ వద్దకు భారీగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.