డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు | CBI case against Dr Sudhakar | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు

Published Wed, Jun 3 2020 3:39 AM | Last Updated on Wed, Jun 3 2020 1:34 PM

CBI case against Dr Sudhakar - Sakshi

సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట(విశాఖ దక్షిణ): వివాదాస్పద వ్యవహార శైలితో కలకలం రేపి.. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి వెల్లడించారు. కేసు వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి.  

నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది.  
మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్‌ సుధాకర్‌.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. 
దీంతో స్థానికులు 100 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయడంతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్‌కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. 
అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. 
డాక్టర్‌ ప్రవర్తనను మొబైల్‌లో వీడియో చిత్రీకరిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ చేతి నుంచి సెల్‌ను లాక్కొన్ని రోడ్డుకేసి కొట్టారు. 
చొక్కా విప్పుకుని జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిలువరించాలని ప్రయత్నించిన పోలీసులపై తిరగబడి.. చొక్కాను చించుకుని హైవేపైకి మళ్లీ వచ్చి.. లారీకి అడ్డంగా వెళ్లారు. 
ఈ పరిణామంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే.. తనకు కరోనా ఉందని, తనను పట్టుకుంటే వైరస్‌ అంటించేస్తానంటూ భయపెట్టారు. పోలీసుల సహాయంతో.. స్థానిక ఆటోడ్రైవర్‌ వైద్యుడి  చొక్కాతోనే.. అదుపు చేయడం కోసం అతని చేతులు కట్టేశారు. 
మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ను ఎమ్మెల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కరోనా కారణంగా బ్రీత్‌ ఎనలైజర్‌ను వాడకుండా కేజీహెచ్‌లో రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు రిఫర్‌ చేశారు.  
సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్‌ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.  
నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.  
ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుమీద ప్రజాప్రతినిధులను దూషింంచడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను తూలనాడటంతో పాటు స్థానికులను భయ బ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సిడి ఫైల్‌ను నాలుగో పట్టణ టౌన్‌ పోలీసులు సీబీఐకి అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement