సాక్షి, అమరావతి: తన తాత ముత్తాతలకు సద్గతుల ప్రాప్తి కోసం భగీరథుడు దివి నుంచి భువికి రప్పించిన గంగమ్మకూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జీవ నదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు, తీస్టా సహా 12 నదుల్లో ప్రవాహం 2100 నాటికి వర్షాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు.
మన దేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా ఖండంలోని 16 దేశాల్లో 167.40 కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని చెబుతోంది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంవోడీ) సంస్థ ఈ నెల 20న విడుదల చేసిన అధ్యయన నివేదిక.
ఇందుకు ప్రధాన కారణం.. ఆ జీవ నదులకు జన్మ స్థానమైన హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు శరవేగంగా కరిగిపోతుండటమేనని తేల్చింది. వాతావరణ మార్పులు, భూఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్లే హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 2010 నాటికి 80 శాతానికి తగ్గిపోవడం ఖాయమని అంచనా వేసింది.
ఆసియా ఖండపు నీటి శిఖరం
ధ్రువ ప్రాంతాల తర్వాత భూగోళంపై అతి పెద్ద హిమనీ నదాలకు నిలయం హిందూకుష్ పర్వత శ్రేణులే కావడం గమనార్హం. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే గంగా, బ్రహ్మపుత్రా, సింధు, తీస్టా సహా 12 నదులు పురుడు పోసుకుని మనదేశంతోపాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర 16 దేశాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులకు ప్రధాన ఆధారం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాలే.
హిమపాతంలో గణనీయంగా తగ్గుదల
కాలుష్యంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమపాతం గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఐసీఐఎంవోడీ అధ్యయనంలో వెల్లడైంది. 1971 నుంచి 2000 సంవత్సరాల మధ్య హిందూకుష్ పర్వత శ్రేణుల్లో అంచనా వేసిన దానికంటే హిమపాతంలో సగటున 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2070 నుంచి 2100 సంవత్సరాల మధ్యలో అంచనా వేసిన దాని కంటే సింధూ బేసిన్‌లో 30 నుంచి 50, గంగా బేసిన్‌లో 50 నుంచి 60, బ్రహ్మపుత్రా బేసిన్‌లో 50 నుంచి 70 శాతం హిమపాతం తగ్గుతుందని అంచనా వేసింది.
శరవేగంగా కరుగుతున్న మంచు
2000 సంవత్సరం నుంచి 2009 మధ్య ఏటా సగటున 0.18 మీటర్ల మేర హిమనీ నదాల పరిమాణం తగ్గితే.. 2010 నుంచి 2019 మధ్య అది 0.28 మీటర్లకు పెరిగిందని ఐసీఐఎంవోడీ తెలిపింది. అంటే.. 2000–2009తో పోల్చి తే 2010–2019 మధ్య హిమనీ నదాల మంచు కరుగుదల 65 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది.
మంచు శరవేగంగా కరుగుతుండటం వల్ల 2100 సంవత్సరం నాటికి హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 80 శాతం తగ్గుతుందని లెక్కగట్టింది. దీనివల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర సహా 12 నదుల్లో వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు తక్కువని అంచనా వేసింది.
ఇది ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని 167.40 కోట్ల మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హిమపాతం తగ్గడం వల్ల 1979 నుంచి 2019 మధ్య గంగా, బ్రహ్మపుత్ర, సింధు బేసిన్‌లలో నీటిలభ్యత తగ్గడం వల్ల 1.29 కోట్ల మంది రైతుల జీవనోపాధులు దెబ్బతిన్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఐఎంవోడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment