వాగ్గేయకార వైభవం
విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని, ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి.
అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు. గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు.
గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..? మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం.
ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు.
నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది.
బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు.
గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు. శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment