సాక్షి, రాజమహేంద్రవరం: మత్స్యసంపదను పెంచడం ద్వారా వేసవిలో మత్స్యకారులకు ఆదాయం వచ్చేలా చూసే లక్ష్యంతో మత్స్యశాఖ చేపట్టిన కార్యక్రమం.. దాని అమలులో చోటు చేసుకున్న లోపాల కారణంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. నగరంలో గోదావరి తీరాన మత్స్యశాఖ చేపపిల్లలను పెంచే కార్యక్రమం చేపట్టింది. అయితే, ఆయా ప్రాంతాల్లో ఇసుక మేటలు తొలగించకపోవడంతో.. తగినంత నీరు లేక, నదిలో వేసిన చేపపిల్లలు నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతానికి వెళ్లిపోతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చేపలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఏర్పడింది. నగరంలోని కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్లలో స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా ఇటీవల 2.25 లక్షల చేపపిల్లలను గోదావరిలో వదిలారు. వాస్తవానికి నీరు ఎక్కువగా ఉన్నచోటనే మత్స్యసంపద వృద్ధి చెందుతుంది. ఎక్కడ నీరు ఎక్కువగా ఉంటే అక్కడకు చేపలు తరలివెళతాయి. స్థానిక మత్స్యకారులు అప్పట్లోనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆకుల దృష్టికి తీసుకెళ్లారు. నీటిమట్టం ఎక్కువగా ఉండేందుకుగానూ నదిలో ఉన్న ఇసుక మేటలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే చేపపిల్లలు వేసినా తమకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని వివరించారు.
దారి తప్పిన మేటల తొలగింపు పనులు
వాస్తవానికి కాటన్ బ్యారేజీకి మూడు కిలోమీటర్ల ఎగువన గోదావరిలో దాదాపు 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసింది. దీనిని తొలగించే ప్రక్రియలో భాగంగా మొదట 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించాలని గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం రూ.16.20 కోట్లు మంజూరు చేసింది. డ్రెడ్జింగ్ చేసే పనిని హైదరాబాద్‌కు చెందిన ఓషన్ స్పార్కిల్ సంస్థకు జలవనరుల శాఖ కేటాయించింది. తొలుత కోటిలింగాల ఘాట్ వద్ద వేసిన మేటల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు రూ.3 కోట్లు కేటాయించారు. ఈ పనులను గత జనవరి మొదటి వారంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, 41వ డివిజన్ కార్పొరేటర్ మర్రి దుర్గా శ్రీనివాస్ ప్రారంభించారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇసుక మేటల తొలగింపు వల్ల కోటిలింగాల ఘాట్‌లో వేసవిలోనూ పుష్కలంగా నీరుంటుందని, చేపలు పెరిగేందుకు దోహదపడుతుందని చెప్పారు. అయితే ఎమ్మెల్యే ప్రకటనలకు భిన్నంగా పనులు జరిగాయి. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకూ ఇసుక పెద్ద ఎత్తున మేటలు వేసింది. అందులో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఆ మేటలను తొలగించాల్సిన అధికారులు పేపర్ మిల్లు వ్యర్థాలు కలిసేచోట, ప్రస్తుతం వేసిన ర్యాంపు వద్ద నదీగర్భంలో ఇసుకను యంత్రం ద్వారా తోడారు. దానిని గట్టుపై పోసి పిఠాపురం, విశాఖకు చెందిన ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర క్యూబిక్ మీటరు రూ.162కు విక్రయించారు.
అయితే ఆయా కంపెనీలవారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన లారీ యజమానులకు నిబంధలనకు విరుద్ధంగా అక్కడే క్యూబిక్ మీటరు రూ.500 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఇసుక మేటలు తొలగింపజేయాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తూ మిన్నకుండిపోయారు. ఫలితంగా మేటలు తొలగించడానికి కేటాయించిన ప్రజాధనం వృథా కావడంతోపాటు.. మత్య్సశాఖ వేసిన చేపపిల్లలు పెరిగేందుకు తగినంత నీరు లేక.. స్థానిక మత్స్యకారులకు ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోతోంది. ఇప్పటికైనా కోటిలింగాల ఘాట్‌లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలని మత్స్యకారులు కోరుతున్నారు.