ప్రతిమెట్టూ.. ఓ ఊరిపెట్టుగా, మొత్తం స్నానఘట్టం చూస్తే.. ఓ పట్టణమే తరలి వచ్చిందా అన్నట్టుగా కిక్కిరిసిపోయింది కోటిలింగాల ఘాట్. ఆసేతు శీతాచల పర్యంతం మరే జీవనది తీరానా లేనంత భారీ ఘాట్‌గా పరిగణిస్తున్న ఈ రేవు.. పుష్కరాల రెండో రోజైన బుధవారం భక్తజన పారావారమే అయింది. అయితే అది ఉదయం మాత్రమే. పుష్కర ఘాట్ దుర్ఘటనతో రాజమండ్రి నగరంలో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. జిల్లాలోని మిగిలిన ఘాట్లలోనూ గణనీయంగా భక్తులు నదీస్నానం ఆచరించారు.
- బోసిపోయిన పుష్కర ఘాట్
- తొక్కిసలాట మరణాల ప్రభావం
- రెండో రోజు రాజమహేంద్రికి తగ్గిన భక్తులు
రాజమండ్రి : పావన వాహిని మహాపర్వం తొలిరోజైన మంగళవారం రాజమండ్రికి జనవాహిని ఉప్పెనై ఉరికి వచ్చింది. గోదావరి స్నానరేవులతోపాటు, నగరంలోని ప్రతి వీధీ.. ప్రతి రహదారీ.. జనప్రవాహాన్ని తలపించాయి. వాహనాలతో కిక్కిరిసిపోయాయి. చివరికి జాతీయ రహదారిపై కూడా వెల్లువై వచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే, దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి రాజమండ్రిలో బుధవారం కనిపించింది. తొలి రోజు పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట.. 27 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన నేపథ్యంలో నగరానికి భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. భక్తజనవెల్లువ గోదావరి పల్లెతీరాలకు తరలిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను అధికం చేసి చూపించేందుకు సిద్ధమవుతోంది.
పుష్కర ఘాట్ ఘటన నేపథ్యంలో పుష్కర స్నానాలకు రాజమండ్రి రావాలంటేనే భక్తజనం భయపడే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం పుష్కరాలకు జనం పోటెత్తారు. ఘాట్‌లవద్ద బారులు తీరారు. పుష్కరాల ఆరంభ ముహూర్తానికన్నా ముందే భక్తులు పుష్కర, వీఐపీ ఘాట్‌లు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్నానాలు చేశారు. చివరకు చిన్నచిన్న ఘాట్‌లలో సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే ఒక్క రోజులోనే పరిస్థితి తల్లకిందులైంది. పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాత పడడంతో నగరానికి వచ్చేందుకు జనం వెనుకంజ వేశారు. విషాద ఘటన జరిగిన పుష్కర ఘాట్‌లోనే కాకుండా మిగిలిన ఘాట్ల వద్ద కూడా జనం తగ్గారు. పుష్కర ఘటనకు తోడు ఘాట్‌ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఘాట్‌లకు రావాలంటే కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి ఉండడం, వేసవిని తలపించే ఎండ.. ఆపై అమావాస్య కావడం భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. అయితే భక్తులు అధికంగా హాజరైనట్టు ప్రభుత్వం అంకెలు ఎక్కువ చేసి చూపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 17.29 లక్షల మంది భక్తులు స్నానం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ పరిస్థితి మాత్రం లేదు.
దేశంలోనే అతి పెద్దదిగా చెబుతున్న కోటిలింగాల ఘాట్‌కు తొలి రోజు 4.20 లక్షల మంది భక్తులు రాగా, గురువారం రెండు లక్షలలోపే భక్తులు వచ్చారు. రాజమండ్రి గ్రామీణ ప్రాంతాల్లో అధికార లెక్కల ప్రకారం సుమారు రెండు లక్షల మంది భక్తులు స్నానం చేయగా, రెండో రోజు ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా స్నానాలు చేశారు. ఒక్క కోటిపల్లి ఘాట్‌లోనే 1.50 లక్షల మంది స్నానాలు చేసినట్టు అంచనా. కాట్రేనికోన, అయినవిల్లి, సోంపల్లి, అప్పనపల్లి, అంతర్వేది ఘాట్‌ల వద్ద సైతం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. అయితే అధికారుల లెక్కలకు, స్నానాలు చేస్తున్నవారి సంఖ్యకు పొంతన ఉండడంలేదన్న విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్యను తగ్గించి. రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పుష్కర ఘాట్ వెలవెల
పుష్కరాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పుష్కర ఘాట్. 2003లో ఇక్కడ అత్యధికంగా 63.34 లక్షల మంది భక్తులు స్నానం చేశారు. ఇక్కడ పుష్కర స్నానం చేస్తేనే అధిక పుణ్యమని భక్తుల నమ్మకం. అటువంటి పుష్కర ఘాట్‌ను చూసి భక్తులు ఇప్పుడు భయపడుతున్నారు. పుష్కర ఆరంభం రోజైన మంగళవారం ఈ ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడడంతో ఈ ఘాట్‌కు వెళ్లేందుకు భక్తులు వెనకాడుతున్నారు. ఇక్కడ పుష్కరాల తొలి రోజు అత్యధికంగా 1.40 లక్షల మంది స్నానాలు చేయగా, బుధవారం మాత్రం వారి సంఖ్య లక్షకు లోపే ఉందని అంచనా. రాజమండ్రి వచ్చే భక్తులను పోలీసులు ముందు జాగ్రత్తగా పుష్కర ఘాట్‌వైపు కాకుండా, ఇతర ఘాట్‌లవైపు మళ్లించారు. భక్తులు సైతం అటు వెళ్లే సాహసం చేయలేకపోయారు. దీంతో ఈ ఘాట్ చాలాసేపు వెలవెలబోతూ కనిపించింది.
అధికారుల తప్పుడు లెక్కలు
పుష్కర ఘాట్ సంఘటనను తక్కువ చేసి చూపించేందుకు, ఈ ఘటనతో సంబంధం లేకుండా భక్తులు అధిక సంఖ్యలో రాజమండ్రి తరలివస్తున్నట్టు చెప్పుకునేందుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రయత్నిస్తోంది. రాజమండ్రిలో పుష్కర ఘాట్‌తోపాటు మిగిలిన ఘాట్ల వద్ద భక్తజనం లేకున్నా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినట్టు ప్రభుత్వం చూపిస్తోంది. తొలి రోజు మంగళవారం తొక్కిసలాట జరిగిన తరువాత కూడా పుష్కర ఘాట్‌కు భక్తుల తాకిడి అధికంగానే ఉంది. అయితే బుధవారం మాత్రం ఉదయం కొద్దిగా జనసంచారం కనిపించినా, మధ్యాహ్నం 11 గంటల నుంచి భక్తుల రాక అంతంతమాత్రంగానే ఉంది. బారికేడ్లు, ఘాట్‌లు ఖాళీగా కనిపించాయి. మంగళవారం ఈ ఘాట్‌లో 1.40 లక్షల మంది స్నానాలు చేశారని ప్రకటించిన ప్రభుత్వం, బుధవారం ఏకంగా రెండు లక్షల మంది స్నానాలు చేసినట్టు చెప్పడం విడ్డూరం.
మరోపక్క కోటిలింగాల ఘాట్ కూడా మధ్యాహ్నం ఖాళీగా కనిపించింది. కానీ ఇక్కడ ఏకంగా 7.64 లక్షల మంది స్నానం చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మంగళవారం ఘాట్ కిటకిటలాడిన సమయంలో ఇక్కడ 4.20 లక్షల మంది ఉన్నారని చెప్పి, జనం లేని రోజున రెట్టింపు సంఖ్యలో జనం వచ్చినట్టు చెప్పడం విచిత్రం. అసలు యాత్రికుల సంచారం పెద్దగా లేని గౌతమ ఘాట్‌లో ఏకంగా 1.19 లక్షల మంది స్నానాలకు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కర ఘాట్ ఘటనను నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజమండ్రి నగరంలో స్నానాలు చేసేవారి సంఖ్యను పెంచి చూపించేందుకు ప్రభుత్వం తాపత్రయపడడం విమర్శలకు తావిస్తోంది.