తిరుమల భక్తులకు పుష్కర కష్టాలు
తిరుచానూరు :శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి రైలులో తిరుపతి వచ్చే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో పుష్కర కష్టాలు ఎదురవుతున్నాయి. రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అటు వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. దీంతో నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. బుధవారం రాత్రి తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై ప్రమాదకర రీతిలో ప్రయాణించాల్సి వచ్చింది. కనీసం నిలబడి ప్రయాణించేందుకు సైతం రైలులో స్థలం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం రెండు నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ రైలులో ప్రయాణించలేకపోయారు.
రైల్వే పోలీసులు, రైల్వే అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పైగా తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. అలాగే పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకపోవడంతో రైల్వే స్టేషన్లోనే గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. తాము ఎలా గమ్యస్థానాలకు చేరుకోవాలంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక రైళ్లు నడిపి తమను గమ్యస్థానాలకు చేర్చాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.