కాగితాలపై కోట్లు.. కార్యాచరణకు తూట్లు | Panchayati Raj Department Detachment | Sakshi
Sakshi News home page

కాగితాలపై కోట్లు.. కార్యాచరణకు తూట్లు

Published Thu, Apr 16 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

Panchayati Raj Department Detachment

- టెండర్ దశలోనే 248 పనులు
- ప్రారంభమైన వాటి విలువ రూ.20 కోట్లే
- పంచాయతీరాజ్ శాఖ నిర్లిప్తత

ఏలూరు (టూటౌన్) :జిల్లాలో మరో 90 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కుంభమేళ తరహాలో పుష్కరాలు నిర్వహిస్తామని ఒక పక్క ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేశారు. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గోదావరి పుష్కరాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని ప్రకటించినా వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. 278 పనులకు ప్రభుత్వం రెండు విడతలుగా అనుమతులు మంజూరు చేసినా ప్రస్తుతం 28 పనులు ప్రారంభమయ్యాయి.  

మరో 248 పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. టెండర్లు ఖరారై, ఒప్పందాలు పూర్తయి పనులు ప్రారంభించడానికి కనీసం మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏలూరు పంచాయితీరాజ్ ఎస్‌ఈ కార్యాలయం నుంచి మొదటి విడతగా రూ.20 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా, వాటికి టెండర్లు వేసి అగ్రిమెంట్ కూడా పూర్తయింది. కానీ 28 పనులను మాత్రమే కాంట్రాక్టర్లు ప్రారంభించారు.

మరో రెండింటిని ప్రారంభించాల్సి ఉంది. రెండో విడతలో 248 పనులకు రూ.36 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆలస్యంగా అనుమతులు ఇవ్వడంతో ఇంకా టెండర్ల ప్రక్రియ దశలోనే ఈ పనులున్నాయి. అధికారులు 248 పనులకు టెండర్లు వేయగా రోజుకు 10 పనులు చొప్పున టెండర్లను తెరుస్తున్నారు. టెండర్లను తెరిచే ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందని, ఆ తరువాత రాబోయే 10 రోజుల్లో ఒప్పందాలు పూర్తి చేస్తామని చెబుతున్నా మొత్తం పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదని సమాచారం. వీటికి అధికారులు మరోసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఒక పక్క పుష్కరాల గడువు దగ్గర పడుతున్నా అధికారుల్లో వేగం కనిపించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖద్వారా పుష్కరాలు జరిగే అన్ని ఘాట్లకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా వీటిని ప్రారంభించడం ఆలస్యమైంది. పుష్కరాలకల్లా పూర్తవకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన స్పందించి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.

పనుల పూర్తికి సత్వర చర్యలు
పుష్కరాల నాటికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడత పనులకు అనుమతులు రావడం ఆలస్యం కావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే అగ్రిమెంట్ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం.
 - సి.వేణుగోపాల్, ఎస్‌ఈ, పంచాయతీరాజ్ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement