గోదావరి వేడుకలకు నేడు శ్రీకారం
రాజమండ్రిలో ప్రారంభం
ఉత్సవాల ప్రారంభ సూచికగా సాయంత్రం అఖండ పుష్కర జ్యోతి ప్రజ్వలన
మంగళవారం ఉదయం పీఠాధిపతుల స్నానాలతో పుష్కరాలు ఆరంభం
హైదరాబాద్, రాజమండ్రి: గోదావరి పుష్కరాలు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభం అవుతున్నప్పటికీ ఆరంభ వేడుకలు సోమవారం సాయంత్రం నుంచే ఊపందుకోనున్నాయి. రాజమండ్రి నగరంలో సాయంత్రం నాలుగు గంటలకు వెయ్యి మంది కళాకారులతో హారతి ఊరేగింపు అనంతరం ‘పుష్కరఘాట్’లో అఖండజ్యోతి ప్రజ్వలనతో పుష్కర వేడుకలు మొదలవుతాయి. అనంతరం గోదావరి అఖండహారతి, ఆకాశ దీపాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అర్ధరాత్రి వరకు సాంసృ్కతిక కార్యక్రమాలు చేపడతారు.
ఈ కార్యక్రమాల్లో సినీ సంగీతదర్శకుడు థమన్, కూచిపూడి కళాకారిణి అంబిక తదితరులు పాల్గొంటారు. కంచి పీఠాధిపతులు మంగళవారం తెల్లవారుజామున 6.26 గంటలకు గోదావరిలో తొలిస్నానాలను చేసి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో విజయేంద్ర సరస్వతి స్నానమాచరించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రారంభ ముహూర్తానికే కుటుంబ సమేతంగా గోదావరి పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం రాజమండ్రిలో మీడియాకు వెల్లడించారు.
పుష్కర పూజలకు ప్రభుత్వ ధరలు
గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్ద ప్రధానంగా నిర్వహించే పూజలకు దేవాదాయశాఖ ధరలను ఖరారు చేసింది. పిండప్రదానం పూజ ధర రూ. 300గానూ, గోదావరి పూజ, ఇతర సంకల్పాలకు రూ. 150, ముసివాయనం పూజకు రూ. 200, స్వయంపాకం పొట్లాలు ఒక్కొక్కటికి రూ. 200లుగా ధరలను ఖరారు చేశారు. భక్తులు నేరుగా పూజారులకే ప్రభుత్వ నిర్ణయించిన ధరలు చెల్లించి పూజలు చేయించుకోవాలి. నిర్ణీత ధరలకు పూజలు నిర్వహించేలా 4,295 మంది పూజార్లకు ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వీరు షిప్టుల వారీగా ఉంటారు.
కోలాహలంగా పుష్కర స్వాగత యాత్ర
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో రెండు రోజుల ముందే పుష్కర సందడి మొదలైంది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన పుష్కర స్వాగత యాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక బృందాల నృత్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాటాలతో స్వాగత యాత్ర వైభవంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ యాత్రలో పాల్గొన్నారు.
గోదావరికి మహానీరాజనం
పుష్కర స్వాగత యాత్ర అనంతరం గోష్పాదక్షేత్రంలో నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై గోదావరికి నీరాజనం సమర్పించారు. పండితులు దోర్భల ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గోదావరికి మహానీరాజనం సమర్పించారు. గోష్పాద క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.
పుష్కరాలకు రండి..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను గోదావరి పుష్కరాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ పర్యటన వివరాలను గవర్నర్‌కు వివరించారు. జపాన్ పర్యటన అనంతరం న్యూఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన అంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు గవర్నర్‌పై తన కేబినెట్‌లోని మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వివాదం సద్దుమణిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. పుష్కర ఏర్పాట్లు గురించి గవర్నర్ అడగ్గా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చంద్రబాబు వివరించారు.
ఇంకా ఏర్పాట్లలో లోపాలే...
పుష్కరాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్డి సమస్య పెద్ద ఇబ్బందిగా మారబోతుంది. ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఈ అంశం తీవ్ర సమస్యగా మారుతుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన దాదాపు 1,400 రెడీమేడ్ మరుగుదొడ్లను ప్రధాన ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెడీమేడ్ మరుగుదొడ్ల నిర్వహణసరిగా కనిపించడం లేదు. మురుగునీటి మళ్లింపు చర్యలు సరిగా లేవు. ఫలితంగా రెడీమేడ్ మూత్రవిసర్జన శాలలు, మరుగుదొడ్లు భక్తులకు సరిగా ఉపయోగపడే అవకాశాలు ఉండవని రాజమండ్రి నుంచి పలువురు సాక్షి ప్రధాన కార్యాలయానికి ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు.