పుష్కరాలకు సర్వం సిద్ధం | Everything to be prepared for Pushkarni | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సర్వం సిద్ధం

Published Sat, Jul 11 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

పుష్కరాలకు సర్వం సిద్ధం

పుష్కరాలకు సర్వం సిద్ధం

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- 108 రోజుల పాటు వెలిగే మహాకాయ దీపం తయారు
- గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం
- 14న దీపం వెలిగించి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం ఫడ్నవీస్
- 12 ప్రత్యేక రైళ్లు నడ పనున్న సెంట్రల్ రైల్వే
సాక్షి, ముంబై:
గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయి. నాసిక్, త్రయంబకేశ్వర్‌లలో గత కొన్ని రోజులుగా పుష్కర పనుల్లో నిమగ్నమైన అధికారులు, అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు, సాధువులు వస్తున్న నేపథ్యంలో గంగాఘాట్ వద్ద ఉన్న మార్కెట్‌ను తాత్కాలికంగా తొలగించి సమీపంలోని మరో ప్రాంతానికి మార్చారు. నాసిక్‌లో మహాకాయ దీపాన్ని వెలిగించేందుకు రికార్డు స్థాయిలో సేకరించిన పత్తితో భారీ వత్తి తయారు చేశారు.

కొల్హాపూర్ జిల్లా శిరోల్ తాలూకా తామదలగే గ్రామంలో ‘దేశభక్తుడు రంతప్పణ్నా కుంబార్ శిరోల్ బ్యాక్‌వర్డ్ క్లాస్ కో ఆపరేటీవ్ కాటన్ మిల్లు’లో ఈ దీపపు వత్తిని తయారు చేశారు. 108 రోజులపాటు వెలిగే దీపం కోసం 750 అడుగుల పొడవైన వత్తిని తయారుచేశారు. గిన్నిస్ బుక్‌లో మహాదీపానికి చోటు సంపాదించడం కోసమే ఇలా చేస్తున్నట్లు కాటన్ మిల్లు అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌రావ్ మానే తెలిపారు. వత్తి తయారు చేసేందుకు రెండు నెలలు పట్టిందని, ఈ నెల 14న నాసిక్‌లో పుష్కర ప్రారంభోత్సవం సందర్భంగా దీపాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా వెలిగించనున్నారని చెప్పారు.
 
కాలుష్య రహిత పుష్కరాలు

పుష్కరాలు కాలుష్క రహితంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే సుమారు 63 ప్రాంతాల్లో సుమారు పలు సంస్థలకు చెందిన 40 వేలమంది స్వచ్చత అభియాన్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నదీ స్వచ్చత అభియాన్‌లో కూడా సుమారు 20 వేల మంది పాలుపంచుకున్నారు. అది విజయవంతం అవడంతో పుష్కరాలను కాలుష్య రహితంగా చేసేందుకు మరోసారి స్వచ్చత అభియాన్ నిర్వహించారు. భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జీ గిరీశ్ మహాజన్ సమక్షంలో దాదాపు 8.50 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటించారు.
 
ఆఖాడాల కీలకపాత్ర

పుష్కరాల్లో సాధువుల ఆఖాడా(సమూహం)లు కీలక పాత్ర వహిస్తాయి. పుష్కరాల సందర్భంగా జరిగే ప్రధాన కార్యక్రమాలన్నీ వారే నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి శైవ , వైష్ణవ ఆఖాడాల్లోని సాధువులు వస్తారు. శ్రీ శంభు పంచ్ దశనామ్ జునా ఆఖాడా, శ్రీ శంభు పంచ్ దశనామ్ ఆవ్హాన్ ఆఖాడా, శ్రీ పంచాగ్నీ ఆఖాడా, శ్రీ తపోనిధి నిరంజనీ ఆఖాడా, శ్రీ తపోనిధి ఆనంద్ ఆఖాడా, శ్రీ పంచాయతీ ఆఖాడా మహానిర్వాణీ, శ్రీ పంచాయతీ అఠల్ ఆఖాడా, శ్రీ బడా ఉదాసిన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ నయా ఉదాసీన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ పంచాయతీ నిర్మల్ ఆఖాడా అనే పది శైవుల ఆఖాడాలు త్రయంబకేశ్వర్‌కి వచ్చాయి.

శ్రీ నిర్మోహి అనీ ఆఖాడా, శ్రీ నిర్వాణీ అనీ ఆఖాడా, శ్రీ దిగంబర్ అనీ ఆఖాడా అనే మూడు ైవె ష్ణవుల ఆఖాడాలు నాసిక్‌లో పుష్కర ఘట్టాలు నిర్వహించనున్నాయి. తొలిరోజు ధ్వజారోహణ, ఊరేగింపు, షాహి స్నానాల ప్రారంభం తదితర ప్రత్యేక ఘట్టాలన్ని ఆఖాడాలు ప్రారంభించనున్నారు. వీరి రాకతో నాసిక్, త్రయంబకేశ్వర్ పరిసరాల్లో ఒకరకమైన ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంటుంది. కుంభమేళా అంటేనే సాధువుల పండుగ అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సారి వ్యాఖ్యానించారు. ‘ఇది సాధువుల కుంభమేళా. కుంభమేళాకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడమే మా బాధ్యత’ అని అన్నారు.
 
మహిళా భద్రత కట్టుదిట్టం
పుష్కరాల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భారీ సంఖ్యలో మహిళా పోలీసులను మోహరిస్తామని, 24 గంటలూ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘మహిళల రక్షణ మా ప్రధాన బాధ్యత. మొత్తం 15 వేల మంది పోలీసులతో పాటు మహిళా పోలీసులను కూడా మోహరిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అదనంగా ఐదుగురు మహిళలను ఏర్పాటు చేస్తాం. నిర్భయ మొబైల్ వ్యాన్‌ను నడుపుతున్నాం. ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూం నంబర్ 100 లేదా 97622 00200 లేదా 97621 00100కు సంప్రదించవచ్చు’ అని నాసిక్ కమిషనర్ ఎస్ జగన్నాథన్ తెలిపారు.
 
పుష్కరాలకు 12 సూపర్ ఫాస్ట్ రైళ్లు
గోదావరి పుష్కరాల సందర్భంగా నాసిక్- హౌరా మధ్య 12 సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02859 నం సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలు నాసిక్ నుంచి జూలై 14, ఆగస్టు 19, 29, సెప్టెంబర్ 13, 18, 25 తేదీల్లో  సాయంత్రం 4.30కు నడపన్నుట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 02860 నం రైలు హౌరా నుంచి జూలై 12న, ఆగస్టు 17, 27, సెప్టెంబర్11, 16,23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరనున్నట్లు తెలిపింది. భుసావల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, రౌర్కేలా, టాటానగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉన్నట్లు వివరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement