Pushkarni tasks
-
పుష్కరాలకు సర్వం సిద్ధం
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - 108 రోజుల పాటు వెలిగే మహాకాయ దీపం తయారు - గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం - 14న దీపం వెలిగించి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం ఫడ్నవీస్ - 12 ప్రత్యేక రైళ్లు నడ పనున్న సెంట్రల్ రైల్వే సాక్షి, ముంబై: గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయి. నాసిక్, త్రయంబకేశ్వర్లలో గత కొన్ని రోజులుగా పుష్కర పనుల్లో నిమగ్నమైన అధికారులు, అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు, సాధువులు వస్తున్న నేపథ్యంలో గంగాఘాట్ వద్ద ఉన్న మార్కెట్‌ను తాత్కాలికంగా తొలగించి సమీపంలోని మరో ప్రాంతానికి మార్చారు. నాసిక్‌లో మహాకాయ దీపాన్ని వెలిగించేందుకు రికార్డు స్థాయిలో సేకరించిన పత్తితో భారీ వత్తి తయారు చేశారు. కొల్హాపూర్ జిల్లా శిరోల్ తాలూకా తామదలగే గ్రామంలో ‘దేశభక్తుడు రంతప్పణ్నా కుంబార్ శిరోల్ బ్యాక్వర్డ్ క్లాస్ కో ఆపరేటీవ్ కాటన్ మిల్లు’లో ఈ దీపపు వత్తిని తయారు చేశారు. 108 రోజులపాటు వెలిగే దీపం కోసం 750 అడుగుల పొడవైన వత్తిని తయారుచేశారు. గిన్నిస్ బుక్‌లో మహాదీపానికి చోటు సంపాదించడం కోసమే ఇలా చేస్తున్నట్లు కాటన్ మిల్లు అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌రావ్ మానే తెలిపారు. వత్తి తయారు చేసేందుకు రెండు నెలలు పట్టిందని, ఈ నెల 14న నాసిక్‌లో పుష్కర ప్రారంభోత్సవం సందర్భంగా దీపాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా వెలిగించనున్నారని చెప్పారు. కాలుష్య రహిత పుష్కరాలు పుష్కరాలు కాలుష్క రహితంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే సుమారు 63 ప్రాంతాల్లో సుమారు పలు సంస్థలకు చెందిన 40 వేలమంది స్వచ్చత అభియాన్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నదీ స్వచ్చత అభియాన్‌లో కూడా సుమారు 20 వేల మంది పాలుపంచుకున్నారు. అది విజయవంతం అవడంతో పుష్కరాలను కాలుష్య రహితంగా చేసేందుకు మరోసారి స్వచ్చత అభియాన్ నిర్వహించారు. భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జీ గిరీశ్ మహాజన్ సమక్షంలో దాదాపు 8.50 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటించారు. ఆఖాడాల కీలకపాత్ర పుష్కరాల్లో సాధువుల ఆఖాడా(సమూహం)లు కీలక పాత్ర వహిస్తాయి. పుష్కరాల సందర్భంగా జరిగే ప్రధాన కార్యక్రమాలన్నీ వారే నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి శైవ , వైష్ణవ ఆఖాడాల్లోని సాధువులు వస్తారు. శ్రీ శంభు పంచ్ దశనామ్ జునా ఆఖాడా, శ్రీ శంభు పంచ్ దశనామ్ ఆవ్హాన్ ఆఖాడా, శ్రీ పంచాగ్నీ ఆఖాడా, శ్రీ తపోనిధి నిరంజనీ ఆఖాడా, శ్రీ తపోనిధి ఆనంద్ ఆఖాడా, శ్రీ పంచాయతీ ఆఖాడా మహానిర్వాణీ, శ్రీ పంచాయతీ అఠల్ ఆఖాడా, శ్రీ బడా ఉదాసిన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ నయా ఉదాసీన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ పంచాయతీ నిర్మల్ ఆఖాడా అనే పది శైవుల ఆఖాడాలు త్రయంబకేశ్వర్‌కి వచ్చాయి. శ్రీ నిర్మోహి అనీ ఆఖాడా, శ్రీ నిర్వాణీ అనీ ఆఖాడా, శ్రీ దిగంబర్ అనీ ఆఖాడా అనే మూడు ైవె ష్ణవుల ఆఖాడాలు నాసిక్‌లో పుష్కర ఘట్టాలు నిర్వహించనున్నాయి. తొలిరోజు ధ్వజారోహణ, ఊరేగింపు, షాహి స్నానాల ప్రారంభం తదితర ప్రత్యేక ఘట్టాలన్ని ఆఖాడాలు ప్రారంభించనున్నారు. వీరి రాకతో నాసిక్, త్రయంబకేశ్వర్ పరిసరాల్లో ఒకరకమైన ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంటుంది. కుంభమేళా అంటేనే సాధువుల పండుగ అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సారి వ్యాఖ్యానించారు. ‘ఇది సాధువుల కుంభమేళా. కుంభమేళాకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడమే మా బాధ్యత’ అని అన్నారు. మహిళా భద్రత కట్టుదిట్టం పుష్కరాల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భారీ సంఖ్యలో మహిళా పోలీసులను మోహరిస్తామని, 24 గంటలూ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘మహిళల రక్షణ మా ప్రధాన బాధ్యత. మొత్తం 15 వేల మంది పోలీసులతో పాటు మహిళా పోలీసులను కూడా మోహరిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అదనంగా ఐదుగురు మహిళలను ఏర్పాటు చేస్తాం. నిర్భయ మొబైల్ వ్యాన్‌ను నడుపుతున్నాం. ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూం నంబర్ 100 లేదా 97622 00200 లేదా 97621 00100కు సంప్రదించవచ్చు’ అని నాసిక్ కమిషనర్ ఎస్ జగన్నాథన్ తెలిపారు. పుష్కరాలకు 12 సూపర్ ఫాస్ట్ రైళ్లు గోదావరి పుష్కరాల సందర్భంగా నాసిక్- హౌరా మధ్య 12 సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02859 నం సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలు నాసిక్ నుంచి జూలై 14, ఆగస్టు 19, 29, సెప్టెంబర్ 13, 18, 25 తేదీల్లో సాయంత్రం 4.30కు నడపన్నుట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 02860 నం రైలు హౌరా నుంచి జూలై 12న, ఆగస్టు 17, 27, సెప్టెంబర్11, 16,23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరనున్నట్లు తెలిపింది. భుసావల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్పూర్, రౌర్కేలా, టాటానగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉన్నట్లు వివరించింది. -
ఇంత దారుణమా..?
- పుష్కరాల పనుల్లో జిల్లా వెనుకబడింది - ఇంకెప్పుడు పూర్తి చేస్తారు - పార్కింగ్ స్థలాలు అవసరమో లేదో తెలియదా..? - ప్రపోజల్స్, పనులు చూస్తే నవ్విపోతారు - పంచాయతీరాజ్ ఇంజినీర్లపై ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి అసహనం ఇందూరు : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా నిర్వహించే పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిద్దామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, మీరేమో ఇక్కడ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. పుష్కర ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మీకు రాలేదా..? ఈ ప్రపోజల్స్‌ను... పనులను ఎవరికైనా చూపిస్తే నవ్విపోతారు. ఇంత దారుణంగా ఏ జిల్లాలో లేదు. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే లే డు.’ అని పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (ఈఎన్సీ) ఎం. సత్య నారాయణరెడ్డి పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా సందర్శనకు వచ్చిన ఆయన పలు మండలాలను పర్యటించి పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంజినీర్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 433 ప్యాకేజీలకు, 3420 రోడ్లు వేస్తున్నామన్నారు. నిజామాబాద్‌లో 16 పుష్కర ఘాట్లకు గాను 15 ఘాట్లకు టెండర్లు నిర్వహించగా, ఇందులో మూడింటికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు రాలేదని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనుల విషయంలో తికమకపడుతున్నారని, గత సమావేశంలో అన్ని వివరించి చెప్పినా ఇంజనీర్లకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ప్రారంభించిన పనులు ఏ ఒక్కటి కూడా ముందుకు కదలడం లేదని, గ్రౌండింగ్, ప్రోగ్రెస్, పర్ఫామెన్స్లో దారుణంగా ఉందని అన్నారు. ఇలాగైతే పనులెప్పుడు పూర్తి చేస్తారని మండిపడ్డారు. ఎక్కువ జన తాకిడి ఉండే కందకుర్తి ఘాట్‌లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడం దారుణమని, ఇదొక్కటే కాకుండా చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు నిర్మించకుండా పనులు చేపట్టడం సిగ్గుచేటన్నారు. పుష్కర పనులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీవ్రం గా ఉందని చెప్పారు. సమష్టిగా పని చేసి జిల్లా రూపు రేఖలు మార్చాలని సూచించారు. జూన్ 15 గడువు... పుష్కరాల పనులపై చాలా ఒత్తిడి ఉందని, ఇంకా నెల న్నర సమయం ఉందని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని ఇం జినీర్లకు సూచించారు. ప్రారంభమైన పనులను, టెండర్లు రాని పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయూలని ఆదేశించారు. గతంలో నిజామాబాద్‌లో ఐదు పుష్కర ఘాట్లు ఉంటే, 11 కొత్త వాటితో కలుపుకుని మొత్తం 16 ఘాట్లు పూర్తి చేయాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఏర్పాటు చేయని వాటికి కలెక్టర్ ద్వారా ప్రపోజల్స్‌ను 24 గంటల్లో తనకు పంపించాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యమూర్తిని ఆదేశించారు.60 శాతం పనులు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను బాధ్యులను చేయాల్సి ఉంటుం దని హెచ్చరించారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్లు వేయడం, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయ డం పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమన్నారు. చేసే పనులు నాణ్యంగా ఉండాలన్నారు. అనంతరం ఎంఆర్ఆర్, ఆర్ఐడీఎఫ్, బీఆర్జీఎఫ్, నాబార్డు, 13వ ఆర్థిక సంఘం, తదితర పథకాల నిధుల ద్వారా చేపడుతున్న భవనాలు, రోడ్డు పనులు, వాటి పురోగతిపై సమీక్షించారు. పీఆర్ డిప్యూటీ డీఈ జలేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నాణ్యతకు తిలోదకాలు..!
భైంసా/బాసర : పుష్కరాల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా ఈ పనులు పుష్కర కాలమైనా నిలుస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పుష్కరాలు రావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులకు నిధులు విడుదల చేసి ప్రత్యేక అధికారులనూ నియమించింది. జిల్లాలో ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించినా బాసరలో సాగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లోపించడంతో ఇంజినీరిం గ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు దక్కించుకున్నది ఒకరైతే.. పనులు చేస్తున్నది మరొకరు అయినా పట్టించుకోవడం లేదు. బాసర గోదావరి నదిలో వాహనాలు వెళ్లే వంతెన నుంచి శివాలయం వరకు 490 మీటర్ల మేర స్నానఘట్టాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. సుమారు అర కిలోమీటరు మేరకు నిర్మించే స్నానఘట్టాలకు ప్రభుత్వం రూ.10.70 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న తర్వాత స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి సోదరుడే ఈ పనులు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు నాణ్యతగా చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. స్నానఘట్టాల నిర్మాణానికి పక్కనే గోదావరి నదిలోని ఇసుకను వాడేస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఇసుక తవ్వడంతో గోదావరి నదిలో గోతులు ఏర్పడ్డాయి. గోతుల్లో తవ్విన ఇసుక పక్కనే స్నానఘట్టాల నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఒకేలా ఉంది. నిర్మాణాలకు వాడుతున్న ఇసుకను స్థానికంగా తవ్వారని నిర్ధారణకు వచ్చినా ఆ విషయాన్ని మాత్రం అధికారులు కప్పిపుచ్చుతున్నారు. మట్టి కలిసి ఉంది.. బాసర గోదావరి నది ఇప్పటి వరకు ఎండిపోలేదు. మొదటిసారి ఎడారిలా కనిపిస్తున్న గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇసుకలో పై పొర అంత నల్లమట్టితో కలిసి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతానికి ఇరువైపులా నల్లరేగడి నేలలు ఉన్నాయి. వర్షాకాలంలో నల్లరేగడి నేలల్లో కురిసిన వర్షపు నీరంతా గోదావరి నదిలోనే కలుస్తుంది. నల్లమట్టి ఇసుకలో కలిసిపోయింది. నల్లని మట్టితో కూడిన ఇసుకను సిమెంట్ పనుల్లో వినియోగిస్తే త్వరగానే పగుళ్లు వస్తాయని నిర్మాణరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. పక్కనే ఉన్న నల్లమట్టితో కూడిన ఈ ఇసుక వినియోగం తగ్గిస్తే నిర్మాణాలకు ఢోకా ఉండదని అంటున్నారు. క్యూరింగ్ కరువే... గోదావరి నది ఎండిపోవడంతో భక్తుల పుణ్యస్నానాల కోసం అధికారులు శివాలయం స్నానఘట్టాల నుంచి గోదావరి నది మధ్యలో ఆరు బోర్లు వేయించారు. బోరుమోటార్ల నుంచి వచ్చే నీరంతా స్నానఘట్టాల వద్ద వదిలేస్తున్నారు. ఇలా నిలిచే నీటిలోనే పుణ్యస్నానాలు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఇలా బోర్లు తవ్వించి నీటిని మళ్లిస్తున్నారు. పక్కనే కొద్దిదూరంలో వంతెన నుంచి శివాలయం వరకు నిర్మిస్తున్న స్నానఘట్టాల పనులన్ని సిమెంట్, కాంక్రిట్ ఇసుకతో చేసేవే. ఈ పనులకు నీటి క్యూరింగ్ ఎంతో అవసరం. ఎదురుగానే ఎండిపోయి ఎడారిలా కనిపిస్తున్న గోదావరి నదిలో నీరైతే లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలకు నీటిని ఎలా సమకూరుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన పనులకు ప్రధానంగా క్యూరింగ్ సమస్య వెంటాడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు. క్యూరింగ్లేని సిమెంట్ నిర్మాణాలు తక్కువకాలంలోనే పగుళ్లు తేలే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిస్తే.. స్నానఘట్టాల వద్ద కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నల్లమట్టిని తవ్విదానిపైనే మొరంవేసి చదును చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మున్ముందు నల్లమట్టిలోపలికి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కూరుకుపోతే పైన చేపట్టే నిర్మాణాలు పగుళ్లుతేలి కనిపిస్తాయి. గోదావరి నీటి ఉధృతికి నిర్మించే స్నానఘట్టాలు చెక్కుచెదరకుండా చర్యలు చేపట్టాలి. నల్లరేగడి భూములకు తాకి ఉన్న నది ఓడ్డుకు ఆనుకుని చేపడుతున్న స్నానఘట్టాల కోసం కొద్దిమేర మట్టిని తవ్వి మొరంవేసి చదును చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.