భైంసా/బాసర : పుష్కరాల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా ఈ పనులు పుష్కర కాలమైనా నిలుస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పుష్కరాలు రావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులకు నిధులు విడుదల చేసి ప్రత్యేక అధికారులనూ నియమించింది. జిల్లాలో ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించినా బాసరలో సాగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లోపించడంతో ఇంజినీరిం గ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పనులు దక్కించుకున్నది ఒకరైతే.. పనులు చేస్తున్నది మరొకరు అయినా పట్టించుకోవడం లేదు. బాసర గోదావరి నదిలో వాహనాలు వెళ్లే వంతెన నుంచి శివాలయం వరకు 490 మీటర్ల మేర స్నానఘట్టాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. సుమారు అర కిలోమీటరు మేరకు నిర్మించే స్నానఘట్టాలకు ప్రభుత్వం రూ.10.70 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న తర్వాత స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి సోదరుడే ఈ పనులు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు నాణ్యతగా చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
స్నానఘట్టాల నిర్మాణానికి పక్కనే గోదావరి నదిలోని ఇసుకను వాడేస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఇసుక తవ్వడంతో గోదావరి నదిలో గోతులు ఏర్పడ్డాయి. గోతుల్లో తవ్విన ఇసుక పక్కనే స్నానఘట్టాల నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఒకేలా ఉంది. నిర్మాణాలకు వాడుతున్న ఇసుకను స్థానికంగా తవ్వారని నిర్ధారణకు వచ్చినా ఆ విషయాన్ని మాత్రం అధికారులు కప్పిపుచ్చుతున్నారు.
మట్టి కలిసి ఉంది..
బాసర గోదావరి నది ఇప్పటి వరకు ఎండిపోలేదు. మొదటిసారి ఎడారిలా కనిపిస్తున్న గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇసుకలో పై పొర అంత నల్లమట్టితో కలిసి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతానికి ఇరువైపులా నల్లరేగడి నేలలు ఉన్నాయి. వర్షాకాలంలో నల్లరేగడి నేలల్లో కురిసిన వర్షపు నీరంతా గోదావరి నదిలోనే కలుస్తుంది. నల్లమట్టి ఇసుకలో కలిసిపోయింది. నల్లని మట్టితో కూడిన ఇసుకను సిమెంట్ పనుల్లో వినియోగిస్తే త్వరగానే పగుళ్లు వస్తాయని నిర్మాణరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. పక్కనే ఉన్న నల్లమట్టితో కూడిన ఈ ఇసుక వినియోగం తగ్గిస్తే నిర్మాణాలకు ఢోకా ఉండదని అంటున్నారు.
క్యూరింగ్ కరువే...
గోదావరి నది ఎండిపోవడంతో భక్తుల పుణ్యస్నానాల కోసం అధికారులు శివాలయం స్నానఘట్టాల నుంచి గోదావరి నది మధ్యలో ఆరు బోర్లు వేయించారు. బోరుమోటార్ల నుంచి వచ్చే నీరంతా స్నానఘట్టాల వద్ద వదిలేస్తున్నారు. ఇలా నిలిచే నీటిలోనే పుణ్యస్నానాలు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఇలా బోర్లు తవ్వించి నీటిని మళ్లిస్తున్నారు. పక్కనే కొద్దిదూరంలో వంతెన నుంచి శివాలయం వరకు నిర్మిస్తున్న స్నానఘట్టాల పనులన్ని సిమెంట్, కాంక్రిట్ ఇసుకతో చేసేవే.
ఈ పనులకు నీటి క్యూరింగ్ ఎంతో అవసరం. ఎదురుగానే ఎండిపోయి ఎడారిలా కనిపిస్తున్న గోదావరి నదిలో నీరైతే లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలకు నీటిని ఎలా సమకూరుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన పనులకు ప్రధానంగా క్యూరింగ్ సమస్య వెంటాడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు. క్యూరింగ్‌లేని సిమెంట్ నిర్మాణాలు తక్కువకాలంలోనే పగుళ్లు తేలే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురిస్తే..
స్నానఘట్టాల వద్ద కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నల్లమట్టిని తవ్విదానిపైనే మొరంవేసి చదును చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మున్ముందు నల్లమట్టిలోపలికి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కూరుకుపోతే పైన చేపట్టే నిర్మాణాలు పగుళ్లుతేలి కనిపిస్తాయి. గోదావరి నీటి ఉధృతికి నిర్మించే స్నానఘట్టాలు చెక్కుచెదరకుండా చర్యలు చేపట్టాలి. నల్లరేగడి భూములకు తాకి ఉన్న నది ఓడ్డుకు ఆనుకుని చేపడుతున్న స్నానఘట్టాల కోసం కొద్దిమేర మట్టిని తవ్వి మొరంవేసి చదును చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.