ఆ ప్రాజెక్టులపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీపక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం లో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులవల్ల ఏపీకి తీరని అన్యాయం జరగబోతోందని, వీటి నిర్మాణం జరిగితే శాశ్వతంగా ఏపీ ప్రజలు సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు, ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పని టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 16, 17, 18 తేదీల్లో కర్నూలులో నిరాహారదీక్ష చేపడుతున్నారని తెలిపారు. జగన్ జలదీక్ష జరుగుతూ ఉండగానే నదీజలాల విషయంలో ఏపీకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా 17న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిందని చెప్పారు.