‘పాలమూరు-రంగారెడ్డి పెద్దపీట
► పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల
► భూకొనుగోళ్ల కోసం ఇప్పటికే రూ.300
► కోట్లు విడుదల చేసింది.
► రిజర్వాయర్లు : నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన
► అవసరమైన భూమి 16,446.40 ఎకరాలు
► రిజిస్ట్రేషన్లు అయినవి 6024.26 ఎకరాలు
► బడ్జెట్ కేటాయింపులు రూ.7,860 కోట్లు
రాష్ట్రం మొత్తంలో సాగునీటి రంగానికి సంబంధించి దాదాపు 35 ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించగా, అత్యధికంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికే కేటాయించింది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయించినట్లు అవగతమవుతోంది. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్మాణం పనులు చేపట్టేందుకు 18ప్యాకేజీలతో రూ.29,924.78కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. ఈ ఎత్తిపోతల కింద భూసేకరణకు రైతుల నుంచి భూకొనుగోళ్ల కోసం రూ.300కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. శ్రీశైలం జలాశయం వెనుకభాగం నుండి నార్లాపూర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా రూపొందించిన ఈ పథకం కింద ఉద్దండాపూర్ జలాశయం వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందించిన అధికారులు టెండర్లను సైతం ఖరారు చేశారు. ఈ ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే రెండుసార్లు మార్పులు జరిగాయి.
చివరికి నార్లపూర్ నుంచి లక్ష్మిదేవిపల్లి వరకు నీటిని ఎత్తిపోసేలా డిజైన్‌ను ఖరారు చేశారు. దీంతో జిల్లాలో 16,446.40 ఎకరాల భూమిని ప్రాజెక్టుల నిర్మాణానికి సేకరించాలని సంకల్పించారు. భూసేకరణ అవార్డు విధానం ద్వారా ఆలస్యమవుతుందన్న భావనతో ప్రభుత్వం 123జీఓను జారీచేసింది. ఇప్పటివరకు నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం జలాశయం ప్రాంతాల్లో 6,024.26 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లను సైతం పూర్తిచేసింది.
ఈ మొత్తం ప్రక్రియలో ఉద్దండాపూర్ తప్ప 2,125.02 ఎకరాల అసైన్డ్ భూములు 12,985.20 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 661.31 ఎకరాల అసైన్డ్, 10,209.15 ఎకరాల పట్టా భూములను అప్పగించేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేశారు. వట్టెం జలాశయం పరిధిలో బిజినేపల్లి మండలంలోని కొందరు రైతులు భూ పరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా లోకాయుక్త జిల్లా కలెక్టర్‌ను కోరింది.