అభయహస్తం కోసం ఎదురుచూపులే!
98 వేల మంది లబ్ధిదారులకు 8 నెలలుగా అందని పింఛన్
సాక్షి, హైదరాబాద్: అభయహస్తం లబ్ధిదారు లకు 8 నెలలుగా పింఛన్లు అందడం లేదు. పింఛన్ల పంపిణీకి సర్కారు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని 20.15 లక్షల మంది మహి ళలు అభయహస్తం లబ్ధిదారులు కాగా, ఇందులో 60 ఏళ్లు పైబడిన 98,032 మంది పెన్షనర్లుగా ఉన్నారు. అభయ హస్తం ద్వారా పెన్షనర్లకు ప్రతి నెలా రూ.500 చొప్పున పింఛన్, ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులకు జీవిత బీమా, వారి పిల్లలకు ఉపకారవేతనాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పింఛన్ నిమిత్తం ప్రతి నెలా రూ.4.90 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. 8 నెలలుగా పింఛన్ బకాయిలను విడుదల చేయలేదు. 2016–17 ఏడాదికి అభయహస్తంకు బడ్జెట్లో రూ.140.27 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
ఇప్పటివరకు 2 త్రైమాసికాల కోసం రూ.70.14 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. మొదటి త్రైమాసిక నిధులనే (రూ. 35.07 కోట్లు) విడుదల చేసింది. రెండో త్రైమాసిక నిధుల విడు దలపై ఆర్థికశాఖ ఇదిగో అదిగో అని అంటుండగా.. మరో 5 నెలల పింఛన్ బకాయిల గురించి ఆలకించేవారు కరువయ్యారు. ఎస్‌హెచ్‌జీ కింద లబ్ధిదారులు చెల్లించిన చందా కు, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన కార్పస్ ఫండ్‌ను గత రెండేళ్లుగా చెల్లించడం లేదు. 2014–15 ఏడాదిలో చెల్లిం చాల్సిన మొత్తం రూ.91.53 కోట్లు ఉండగా, 2015–16లో మరో రూ.75.69 కోట్లు సర్కారు బకాయి పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అభయహస్తం పథకానికి 141.65 కోట్లు అవసరమని సెర్ప్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాద నలు పంపింది. అభయహస్తం పింఛన్లకు రూ.68.10 కోట్లు, కార్పస్‌ఫండ్‌కు రూ.73.55 కోట్లు అవసరమని సెర్ప్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది.