ఆదాయ లోటా.. మళ్లీ మిగులా? | Revenue Surplus again or deficit? | Sakshi
Sakshi News home page

ఆదాయ లోటా.. మళ్లీ మిగులా?

Published Sun, Mar 5 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

ఆదాయ లోటా.. మళ్లీ మిగులా?

ఆదాయ లోటా.. మళ్లీ మిగులా?

రెవెన్యూ ఆదాయాన్ని తేల్చేది ఆర్థిక సంవత్సరపు చివరి 4 నెలలే
నవంబర్‌ నాటికి రాష్ట్రంలో రూ.7,147 కోట్ల లోటున్నట్లు తేల్చిన కాగ్‌
రూ.45,190 కోట్లుగా రెవెన్యూ ఆదాయం
రూ.52,337 కోట్లుగా నమోదైన రెవెన్యూ వ్యయం


సాక్షి, హైదరాబాద్‌: తొలి రెండేళ్లు రెవెన్యూ మిగులును నిలబెట్టుకున్న తెలంగాణ ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మిగుల్లోనే ఉంటుందా లేదా లోటు దిశగా పయనిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో తెలంగాణ దాదాపు రూ.7 వేల కోట్ల రెవెన్యూ లోటును చవిచూసింది. రెవెన్యూ ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 2016 నవంబర్‌ వరకు దేశంలోని అన్ని రాష్ట్ర ఆదాయ వ్యయాల వివరాలను ఇటీవల రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్, భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తమ వెబ్‌సైట్‌లలో పొందుపరిచాయి.

ఈ గణాంకాల ప్రకారం నవంబర్‌ నాటికి తెలంగాణ రెవెన్యూ ఆదాయం రూ. 45,190.73 కోట్లు, రెవెన్యూ వ్యయం 52,337.93 కోట్లు. ఈ లెక్కన రెవెన్యూ లోటు రూ. 7,147.20 కోట్లు, ద్రవ్య లోటు రూ. 22,541 కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలు సైతం నెరవేరలేదని ఈ గణాంకాలు వేలెత్తి చూపించాయి. తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాది 2013–14లో రూ. 369 కోట్ల మిగులు, 2015–16లో రూ. 241 కోట్ల మిగులు ఉన్నట్లుగా అకౌంటెంట్‌ జనరల్‌ ఆడిట్‌ లెక్కల్లో తేలింది. నవంబర్‌ నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ ఘనతను నిలబెట్టు కుంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

కానీ ఆదాయ వ్యయాలు డోలాయ మానంగా ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆరంభంలో ఆదాయం తక్కువగా ఉంటుందని, ఖర్చులు మాత్రం వెచ్చించని తప్పని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి 4 నెలల్లో ఖర్చులకు కళ్లెం పడుతుందని, ఆదా యం పెరిగిపోతుందని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది సైతం రెవెన్యూ మిగులు ఉంటుందనే ధీమాను వెలిబుచ్చుతున్నారు.

అంచనాల్లో ఆదాయం సగమే...
గత ఏడాది అసెంబ్లీలో రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం భారీగానే అంచనాలు వేసుకుంది. రూ. 1,00,924 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరుతుందని ఆశించింది. కానీ తొలి 8 నెలల్లో ఆశించినంత రాబడి రాలేదు. వార్షిక లక్ష్యంతో పోలిస్తే నవంబర్‌ నాటికి సగం కంటే తక్కువగా 44.78 శాతం ఆదాయమే సమకూరింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు ఈ పద్దులో వస్తాయి. వాటి కింద నెలకు సగటున రూ. 5,648 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రెవెన్యూ ఆదాయం రూ. 72 వేల కోట్ల నుంచి రూ. 75 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే దాదాపు 25 శాతం ఆదాయం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్‌ తర్వాత ప్రభుత్వం ఖర్చులకు కళ్లెం వేసినప్పటికీ పాత నోట్ల రద్దు పరిణామాలు ఆదాయ మార్గాలన్నింటిపై ప్రభావం చూపాయి.  దీనికి ప్రత్యామ్నాయం గా కేంద్రం రాష్ట్రాలకిచ్చే పన్నుల వాటా నిధులు ఎక్కువగానే విడుదల చేసింది. దీంతో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా సర్దుబాటు జరిగింది. లేకుంటే ఆర్థిక పరిస్థితి మరింత గడ్డుగా ఉండేది. భూముల అమ్మకాల ద్వారా దాదాపు 11 వేల కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం వేసుకున్న అంచనాలు కార్యాచరణలో ఆశించినంత ఫలితం ఇవ్వలేదు.

రెవెన్యూ రాబడి వృద్ధి 10 శాతమే...
రెవెన్యూ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 10 శాతం పెరిగింది. 2015–16లో నవంబర్‌ నాటికి రూ. 41,049 కోట్ల ఆదాయం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 45,190 కోట్లు అర్జించింది. అంటే రూ. 4,141 కోట్ల మేర కు రాబడి పెరిగింది. రెవెన్యూ ఆదాయ వృద్ధి 10.08 శాతం నమోదైంది. బడ్జెట్‌లో వేసుకున్న అంచనా ప్రకారం 38.47 శాతం ఆదాయం పెరగాలి. కానీ అందులో మూ డో వంతు ఆదాయ వృద్ధి నమోదవడం ఆర్థిక శాఖను కొంత నిరాశకు గురి చేసింది. ఇదే వ్యవధిలో ఖర్చుకు మాత్రం సర్కారు వెనుకాడలేదు. జీతభత్యాలు, వడ్డీలు, నిర్వహణ ఖర్చుల వంటి ప్రణాళికేతర వ్యయం కింద నవంబర్‌ నాటికే రూ. 39 వేల కోట్లు వెచ్చించింది. అభివృద్ధి పనులు, ప్రగతి కార్యక్రమాలకు వెచ్చించే నిధులను నిర్దేశించే ప్రణాళిక వ్యయం కింద రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement