కేంద్ర పద్దుపై కోటి ఆశలు | The state government is eagerly waiting for the budget | Sakshi
Sakshi News home page

కేంద్ర పద్దుపై కోటి ఆశలు

Jul 23 2024 5:08 AM | Updated on Jul 23 2024 5:08 AM

The state government is eagerly waiting for the budget

కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు భారీగా కోరుతున్న సర్కారు

ఈ రెండూ అటూ ఇటూ అయితే రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలు తారుమారు!

ట్రిపుల్‌ ఆర్, పాలమూరు–రంగారెడ్డి, మూసీ సుందరీకరణ తదితర అంశాల్లో కేంద్ర వైఖరి ఎలా ఉంటుందోనన్న చర్చ

ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ లాంటి భారాల నుంచి ఉపశమనానికి సాయం అవసరమంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

తెలుగింటి కోడలు ‘పదేళ్ల పెండింగ్‌’ పట్టించుకుంటారా?

రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2024–25) కేంద్రం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కారణాలేవైనా గత పదేళ్లుగా తెలంగాణ అవసరాలు, అభ్యర్థనలను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందని ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తామని చెపుతున్న తమకు ఏ మేరకు సాయమందుతుందోననే ఉత్కంఠ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కనిపి స్తోంది. 

ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్‌ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐల ఆధునీకర ణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్‌ బడ్జెట్‌ (బడ్జెటే తర) రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్‌ తగ్గింపు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈసారి ఎలా ఉంటుందోనన్న చర్చ రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. 

రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవు తుందని, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్‌ బడ్జెట్‌ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాయి. 

ఆ రెండిటిపై గంపెడాశలు..
 కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దు లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తు న్నాయి. వీటిని బట్టే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా ఉంటాయని, ఈ రెండు పద్దుల్లో కేటాయింపులు అటూ ఇటు జరిగితే మొత్తం బడ్జెట్‌ అంచనాలే తారు మారవుతాయని చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభు త్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పన్నుల్లో వాటా కింద రూ.26 వేల కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయి డ్‌ పద్దు కింద రూ.21 వేల కోట్ల పైచిలుకు నిధులను ప్రతిపాదించింది. ఇవి రెండూ కలిపి మొత్తం బడ్జెట్‌లో 17 శాతం కావడం గమనార్హం. కాగా కేంద్ర పన్నుల వాటాలో ఈసారి పెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తు న్నామని, అలాగే గత కొన్నేళ్లుగా ఆశించిన మేర ఇవ్వని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను ఈసారైనా అవసరం మేరకు కేటా యించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

నికర అప్పు సీలింగ్‌పై తేల్చండి
జాతీయ రహదారుల నిర్మాణానికి, ఉపాధి హామీకి, వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు, ఆర్థిక సంఘం సిఫారసుల అమలుకు బడ్జెట్‌ కేటాయింపు, మహిళా శిశు సంక్షేమ పద్దులను పెంచడం ద్వారా పరోక్షంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నికర అప్పుపై సీలింగ్‌ను కూడా బడ్జెట్‌ ప్రతిపాదనల సమయంలోనే వెల్లడించాలని, తద్వారా తాము అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకునే వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి జీఎస్టీ విధించకూడదని, ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (ఈఎన్‌ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికేంద్రాన్ని కోరారు.

ఈసారి బడ్జెట్‌లో తెలంగాణ ఆశిస్తున్నవివే..
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరు ద్ధరణ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, ఆఫ్‌బడ్జెట్‌ రుణాల విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీ లకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు, సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్‌ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్‌ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్‌ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు. 
 
నష్టాలకు తోడు బకాయిలు..!
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపో యింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా రూ. 33,712 కోట్ల రెవెన్యూ నష్టం  జరిగిందని, నీతి ఆయోగ్‌ మిషన్‌ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన రూ.19,205 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.17,828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. 

2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి రూ.5,374 కోట్లు ఇంకా అలాగే ఉన్నాయని, వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద రూ.2,250 కోట్లు, 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రూ.817 కోట్లు,  15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు రూ.723 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు పొరపాటుగా బదిలీ అయిన సీసీఎస్‌ పథకాల నిధులు రూ.495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ విజ్ఞప్తులు, సూచనలపై తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement