సాక్షి, హైదరాబాద్: సామాజిక సమానత్వం తెచ్చే రీతిలోనే బడ్జెట్ రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొ న్నారు. గురువారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ..అడ్డగోలుగా హామీలిచ్చిన ప్రభుత్వాలు, వాటి అమలుకు ఆదాయం ఎలా సమకూరుతుందో తెలియని స్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టాయని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, మంజూరులేని పరిస్థితిలో అనేక వర్గాలు ఫలితం పొందలేకపోయారని తెలిపారు. ఇలాంటి పొరపాటుకు తావులేకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించామని చెప్పారు.
అందుకే బడ్జెట్‌ను కుదించాల్సి వచ్చిదని వివరించారు. ప్రవేశపెట్టిన రూ.2,75, 891 బడ్జెట్... ఆదాయం, ఖర్చు కు మధ్య మహా అయితే 6% కన్నా తక్కువ ఉండబోదని తెలిపారు. గత పదేళ్ల కాలంలో మొత్తం బడ్జెట్ కేటాయిపులు రూ.14,87,834 కోట్లు అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.12,25,312 కోట్లు అని తెలిపారు. ఆదాయమే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఈ పదేళ్లలో రూ. 2,65,212 కోట్లు కేటాయింపుల్లో ఖర్చు చేయలేదన్నారు. కేంద్రనిధులు తెచ్చేందుకు బీజేపీ సభ్యులు కూడా సహకరించాలని కోరారు. ఆర్థికలోటు అధిగమించేందుకు అప్పులు చేయక తప్పదన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. నిరుద్యోగుల కష్టాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, నిరుద్యోగుల కలలు నిజం చేస్తూ ఉద్యోగాల జాతర కొనసాగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment