సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
శనివారం రూ.2,75,891 కోట్ల అంచనాలతో రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024–25ను అసెంబ్లీలో భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. తర్వాత సభలను ఉద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్‌లో రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,669 కోట్ల మూలధన వ్యయాన్ని చూపారు. బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంశాలు వారి మాటల్లోనే..
‘‘కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం. ఆరు హామీల కోసం ప్రజల నుంచి 1.29 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా ఆర్టీసీకి రూ. 300 కోట్లు అదనపు నిధులిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవల పరిమితిని రూ.5లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచాం. మరో రెండు ముఖ్యమైన గ్యారంటీలైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే విధివిధానాలను సిద్ధం చేసి ప్రజలకు ఫలాలను అందిస్తాం.
పటిష్టమైన ఐటీ విధానం తెస్తాం
బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన స్థితిగతుల వృద్ధికి కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకుంటాం. ఐటీని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. పటిష్టమైన ఐటీ విధానం కోసం అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం. దేశంలో పటిష్టమైన ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. బడ్జెట్‌లో ఐటీ శాఖకు రూ.774 కోట్లను ప్రతిపాదిస్తున్నాం.
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11శాతం నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వాలని.. ఈ నిధుల్లో 61శాతం మేర గ్రామాలకే కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఈ సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.40,080 కోట్లు కేటాయిస్తున్నాం. పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.11,692 కోట్లను కేటాయిస్తున్నాం.
మూసీ ప్రక్షాళనకు రూ.1,000 కోట్లు..
హైదరాబాద్ అభివృద్ధితో సృష్టించిన సంపద ఏ కొందరు అధికారులు, నాయకుల స్వార్థం కోసం కాదు. మూసీని ప్రక్షాళన చేసి, పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చే కార్యాచరణ ప్రారంభించాం. హైదరాబాద్ మెడలో అందమైన మణిహారంలా మూసీని తీర్చదిద్దడానికి రూ.1,000 కోట్లను ప్రతిపాదిస్తున్నాం.
త్వరలో జాబ్ కేలండర్ ప్రకటన
‘‘ఉద్యోగ నియామకాల కోసం జాబ్ కేలండర్ తయారీ ప్రక్రియ ప్రారంభించాం. మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నాం. 15 వేల కానిస్టేబుళ్ల నియామకాలను త్వరలో పూర్తిచేస్తాం. 64 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతించాం.
► వైద్య రంగానికి బడ్జెట్‌లో రూ.11,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య–నర్సింగ్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తాం. నిమ్స్‌ను విస్తరిస్తాం. ఉస్మానియా ఆస్పత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తాం.
► రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలు, స్కూల్ యూనిఫారాలను ఇకపై చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తాం. గిగ్ వర్కర్లకు రూ.5లక్షల ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చాం.
► గృహజ్యోతి కింద అర్హత ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కోసం బడ్జెట్‌లో రూ.2,418 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తాం.
►వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీ విద్యుత్ కోసం ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,825 కోట్లను కేటాయిస్తున్నాం.
► ఇందిరమ్మ పథకం కింద.. ఇళ్లు లేనిపేదలకు ఇంటి స్థలం, స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు అందించే కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.7,740 కోట్లను ప్రతిపాదిస్తున్నాం.’’ అని తన ప్రసంగంలో చెప్పారు.
మూడు జోన్లుగా తెలంగాణ
తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రతిపాదిస్తున్నాం. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగర ప్రాంతం, ఔటర్‌రింగ్ రోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం సెమీ అర్బన్ జోన్, రీజనల్ రింగ్‌రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్‌గా నిర్ధారించి.. దానికి తగ్గట్టు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని మా ఆలోచన.
► గురుకుల ఎంబీఏ కాలేజీలు..: ఎస్సీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ.1,000 కోట్లు, ఎస్టీ గురుకుల భవనాలకు రూ.250 కోట్లు, బీసీ గురుకుల భవనాలకు రూ.1,546 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం.
► ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్..: రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌హబ్‌గా రూపొందిస్తాం. ప్రతి మండలంలో ఆధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. పైలట్ ప్రాతిపదికన వీటి ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఉస్మానియా వర్సిటీతో సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి రూ.500 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.21,389 కోట్లు ఇస్తున్నాం.
► పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను పూర్తిచేసి ఎగువ ప్రాంతాలైన ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సాగునీరు అందిస్తాం. పెండింగ్‌లోని ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వగల శ్రీశైలం ఎడమగట్టు కాల్వ, కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయల్‌సాగర్, ఎస్సారెస్పీ వరద కాల్వ, దేవాదుల, కుమురంభీం, చిన్న కాళేశ్వరంప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తాం..’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment