అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రజలు బాగుండటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్‌ఎస్ కోరుకుంటోందని, అలాంటి ఆశలు నిజం కానివ్వబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. అలాంటి పగటి కలలను కనడం బీఆర్‌ఎస్ మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28నే ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
మా పార్టీలోకి వస్తేనే పథకాలు..
అలాంటి బెదిరింపులు ఉండవు తెలంగాణ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఆరు గ్యారంటీ పథకాల్లో అవకాశం కల్పిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే.. మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వంటిæ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో ఉండవని భట్టి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీస్‌తో పాటు ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగిస్తామని చెప్పారు.
పదేళ్లుగా మగ్గిపోయిన ప్రజలకు ఇప్పుడే ఊపిరి
కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక పదేళ్లుగా బీఆర్‌ఎస్ పాలనలో మగ్గిపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగించిందని విమర్శించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చిందని, ఇప్పుడు అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతిఓజా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment