రూ.31 వేల కోట్లు అని చెప్పి. రూ.26 వేల కోట్లే కేటాయింపు
రూ.5 వేల కోట్లు కోత విధించడంతో తదుపరి విడతల రుణమాఫీపై అనుమానాలు
ఎంతమందికి మాఫీ లబ్ధి అందకుండా పోతుందోనన్న చర్చ
మొదటి విడతలో రూ.లక్ష లోపు మాఫీ వర్తించకపోవడంపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
రైతు భరోసాలోనూ భారీగా కత్తెర!
కేవలం రూ.15 వేల కోట్లే కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు నిజమేనని బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీకి గాను రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పగా, గరువారం నాటి రాష్ట్ర బడ్జెట్లో రూ.26 వేల కోట్లే కేటాయించడం గమనార్హం. ఏకంగా రూ.5 వేల కోట్లు కోత విధించడంతో.. ఈ మేరకు మాఫీ లబ్ధిదారుల్లో కోత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొదటి విడతలో లక్షలాది మందికి జరగని మాఫీ
మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగానే అర్హులైన లక్షలాది మంది రైతుల అప్పులు మాఫీ కాలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రేషన్‌కార్డు లేనివారిని అనర్హుల్ని చేయడం, పీఎం కిసాన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే రుణమాఫీ జరగలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ముఖ్యమంత్రి చెప్పిన మొత్తాని కంటే భారీగా నిధులు తగ్గించడం చూస్తే నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో అర్ధమవుతోందని అంటున్నారు. మొదటి విడత రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు రుణాలున్న 11.32 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,014 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకున్న రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది.
మొత్తం 39 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం మొన్నటివరకు చెబుతూ వచ్చింది. కానీ బడ్జెట్‌లో రూ.26 వేల కోట్ల మేరకే కేటాయింపులు జరపడంతో.. తదుపరి విడతల్లో ఎంతమందికి రుణమాఫీ జరుగుతుందో, ఎంత మందికి పథకంతో లాభం లేకుండా పోతుందోనన్న చర్చ జరుగుతోంది. తొలి విడతలో రుణమాఫీ కాని అర్హులైన రైతులు లక్షలాది మంది ఇప్పటికీ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
రైతు భరోసాకు గతంలో కేటాయించినంతే..
రైతు భరోసాకు కూడా ప్రభుత్వం సరిపడా నిధులు ప్రతిపాదించలేదు. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఒక్కో ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ రైతుభరోసా (రైతుబంధు) కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెరగకపోవడం గమనార్హం. 2023–24 వానాకాలం సీజన్‌కు అప్పటి ప్రభుత్వం రూ.7,625 కోట్లు ఇచ్చింది. యాసంగి సీజన్ నాటికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతే సొమ్ము ఇస్తామని ప్రకటించి అమలు చేసింది.
అంటే ఆ సంవత్సరం రైతుబంధు కింద రూ.15,250 కోట్లు రైతులకు అందజేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రైతు భరోసాకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామ ని చెప్పినా, బడ్జెట్లో మాత్రం రూ. 15,075 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిని బట్టి చూస్తే రైతు భరోసాలోనూ భారీగా కోతలు ఉంటాయనే విషయం అర్ధమవుతోందని అంటున్నారు. గతంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకూ రైతుబంధు వర్తింపజేశారని.. అలాంటి వాటిని గుర్తించి తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కౌలు రైతుల ఊసే లేదు
కౌలు రైతుల ఊసే బడ్జెట్లో లేదు. భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 1,200 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము కేవలం 10 లక్షల కూలీలకే సరిపోతుందని అంటున్నారు. కాగా రాష్ట్రంలో 25 లక్షల నుంచి 30 లక్షల వరకు రైతు కూలీలు ఉంటారని అంచనా.
పంటల బీమా కవరేజీకి కోత!
ఈ సీజన్ నుంచి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం రూ.3 వేల కోట్లు అవసరం అని అంచనా వేశారు. కానీ బడ్జెట్లో పంటల బీమాకు రూ.1,300 కోట్లే కేటాయించారు. దీనిని బట్టి చూస్తే పంటల బీమా కవరేజీ చాలా తక్కువ ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రైతు బీమాకు రూ.1,589 కోట్లు, పంటల బోనస్‌కు రూ.1,800 కోట్లు కేటాయించారు.
రూ.500 చొప్పున బోనస్ సొమ్ము ఏమేరకు సరిపోతుందో అనుమానమేనని అంటున్నారు. వ్యవసాయానికి మొత్తం రూ.72,659 కోట్లు కేటాయించామన్న ప్రభుత్వం.. అందులో విద్యుత్ సబ్సిడీకి రూ.11,500 కోట్లు, నీటిపారుదల శాఖ రూ.10,829 కోట్లు, ఇతర పథకాలకు రూ.3,366 కోట్లు కలిపింది. ఆయిల్ పామ్ సాగును లక్ష ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.1,358 కోట్లు కేటాయించారు. రైతు వేదికలకు రూ.43 కోట్లు, రైతులకు విత్తనాల సరఫరాకు రూ.106 కోట్లు ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment