ఈవీలకు స్వర్ణయుగం..
జీవితకాల పన్ను మినహాయింపు
అమృత్– 2 కింద సీవరేజీ, ఎస్టీపీలు?
గిగ్ వర్కర్స్‌కు ఆరోగ్య బీమా గ్రేటర్‌లో 3 లక్షల మందికి ప్రయోజనం
అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో ఆసరా?
చిన్న తరహా పరిశ్రమలకు ఊతం
తగ్గనున్న ఔషధాల ధరలు
కేంద్ర బడ్జెట్‌లో నగరానికి కాసింత ఊరట
పార్లమెంటులో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నగరానికి ప్రాధాన్యం కాసింతే దక్కింది. హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశపై కేంద్రం ఊరించి ఉస్సూరుమనిపించింది. మెట్రోపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మూసీ ఊసే లేదు. కాగా.. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది.
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభించింది. గిగ్‌వర్కర్స్‌కు ఆరోగ్య బీమా కల్పనతో గ్రేటర్‌లో 3 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్‌తో హైదరాబాద్ నగరంలో చేపట్టే పనులకు ప్రయోజనం కలిగే అవకాశాలుండవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలపై జీవిత కాల పన్ను మినహాయింపుతో గ్రేటర్‌లో ఈ– వాహనాల దూకుడు పెరగనుంది. అమృత్– 2.0 కింద హైదరాబాద్ సీవరేజీ ఎస్టీపీ ప్రాజెక్టులకు స్థానం దక్కినట్లు తెలుస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశపై
కేంద్రం ఊరించి ఉస్సూరుమనిపించింది. శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెండో దశ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. గత బడ్జెట్‌లో చెన్నై మెట్రో విస్తరణకు నిధులు కేటాయించారు. ఈసారి అదే తరహాలో హైదరాబాద్‌కు నిధుల కేటాయింపుతో పాటు అనుమతులు కూడా లభించవచ్చని నగరవాసులు ఆశించారు. కానీ.. కనీసం మెట్రోపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రోరైల్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం 74.6 కిలోమీటర్ల కారిడార్‌లతో డీపీఆర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.
అనంతరం ఫోర్త్త్‌సిటీ, నార్త్‌సిటీ ప్రాజెక్టులను కూడా రెండో దశలో భాగంగా చేర్చి సుమారు 161.4 కిలోమీటర్ల వరకు నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి ఐదు కారిడార్‌లకు సుమారు రూ.24 వేల కోట్లకు పైగా అంచనాలు సిద్ధం చేశారు.కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సావరిన్ గ్యారంటీతో పాటు రూ. 4230 కోట్లు తన వాటాగా కేటాయించవలసి ఉంది. కానీ రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఆమోదం లభించలేదు. నిధులు కూడా కేటాయించలేదు.కేంద్రం వైఖరి పట్ల కాంగ్రెస్ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో చెన్నైకు అడగకుండానే నిధులు కేటాంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో తీవ్రమైన వివక్షను చూపుతుందని పేర్కొంటున్నాయి.
బడ్జెట్‌లోనే ప్రస్తావించాల్సిన అవసరం లేదు...
మరోవైపు మెట్రోపైన బడ్జెట్‌లోనే ప్రస్తావించాల్సిన అవసరం లేదని, కేంద్రం విడిగా కూడా ప్రకటన చేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే నిధులు సైతం ఆటోమేటిక్‌గా విడుదలవుతాయని పేర్కొంటున్నారు. మెట్రో రెండోదశకు నిధుల కొరత ఎట్టిపరిస్థితుల్లోనూ సమస్య కాదని, సావరిన్ గ్యారంటీ లభించడమే ప్రధానమని మెట్రోరైల్ అధికారి ఒకరు చెప్పారు.
అటల్ టింకరింగ్ ల్యాబ్‌లపై ఆశలు
కేంద్ర బడ్జెట్‌లో సుమారు 50 వేల ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింగరింగ్ ల్యాబ్ (ఏటీఎల్)లను ఏర్పాటు ప్రకటన ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 40 పాఠశాలలో టింకరింగ్ ల్యాబ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ల్యాబ్‌ల మంజూరుతో మహా నగర పరిధిలో మరో 50 వరకు వచ్చే అవకాశాలున్నట్లు విద్యాశాఖ అంచనా వేస్తోంది
గిగ్‌వర్కర్స్‌కు ఆరోగ్య బీమా గ్రేటర్‌లో 3 లక్షల
మందికి పైగా ప్రయోజనం
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే గిగ్‌వర్కర్స్‌కు కేంద్రం తాజా బడ్జెట్‌లో ఆరోగ్యబీమా సదుపాయాన్ని కలి్పంచింది. పీఎం జన్ ఆరోగ్యయోజన పథకంలో భాగంగా ఈ సదుపాయం లభించనుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ యాప్ ఆధారిత సేవలను అందజేస్తున్న సుమారు 3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్‌లు నడిపే డ్రైవర్‌లతో పాటు స్విగ్గి, జొమోటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్ర వంటి పలు యాప్ ఆధారిత డెలివరీబాయ్స్‌కు ఈ పథకం వర్తించనుంది. ఆరోగ్యబీమా పథకం కోసం తాము చేపట్టిన ఉద్యమానికి కేంద్రం నుంచి స్పందన లభించిందని ఫోర్స్‌వీలర్‌డ్రైవర్స్, గిగ్‌రవర్కర్స్ యూనియన్ ప్రతినిధి సలావుద్దీన్ తెలిపారు.
చిన్న తరహా పరిశ్రమలకు ఊతం
కేంద్ర బడ్జెట్‌లో సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభించింది. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు, స్టార్టప్‌లకు రుణాలను రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల పెంపు పట్ల ఆశలు చిగిరిస్తున్నాయి. మహా నగర పరిధిలో సుమారు 55 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ప్రధానంగా నగర పరిధిలో సనత్‌నగర్, ఆజామాబాద్, చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలు ఉండగా, శివార్లలో ఉప్పల్, మౌలాలి, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం, గాం«దీనగర్, బాలానగర్, పటాన్‌చెరు, వనస్థలిపురం తదితర పారిశ్రామిక వాడల్లో పెద్దసంఖ్యలో స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు విస్తరించి ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు మూడు లక్షల మంది వరకు కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
రుణ పరిమితి పెంపు హర్షణీయమే: జహంగీర్, బాలానగర్ స్మాల్ స్కేల్
ఇండ్రస్టీస్, బాలానగర్
రుణాల పరిమితి పెంపు హర్షణీయం. ఇది చిన్నతరహా పరిశ్రమలకు ఎంతో ఊతం ఇస్తోంది. కానీ.. ఎలాంటి చిక్కులు లేకుండా రుణ పరిమితి పెంపు అమలు చేయాల్సి అవసరం ఉంది. గతంలో పరిశ్రమరంగ సంక్షోభ సమయంలో సవాలక్ష కొర్రీలతో మొక్కుబడిగా రుణాలు అందించి చేతులు దులుపుకొన్నారు. అలాంటి ఘనలు పునరావృత్తం కాకుండా రుణ పరిమితి పెంపు అమలు చేయాలి.
18 లక్షల మంది వేతన జీవులకు ఊరట
కేంద్ర బడ్జెట్‌లో మధ్యతరగతి, వేతన జీవులకు ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్ మహా నగరంలో సుమారు 18 లక్షల మంది వేతన జీవులకు లబ్ధి చేకూర నుంది కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్స్ రూ.12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి పన్ను నుంచి మినహాయింపు లభించింది. ఆపై ఆదాయం ఉంటే మాత్రం రూ.0 నుంచి రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టనక్కర్లేదు. రూ.4–రూ.8 లక్షల ఆదాయం మీద 5 శాతం, రూ.8–రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12–రూ.16 లక్షల ఇన్‌కమ్‌పై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఇన్‌కమ్ మీద 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల ఆదాయంపై 25 శాతం.. రూ.24 లక్షల కంటే అధిక ఆదాయం కలిగిన వారికి 30 శాతం ట్యాక్స్ విధిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రిబేట్ రూపంలో పలు శ్లాబ్‌ల వారికి డబ్బులు రిటర్న్ వస్తాయి. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల మాత్రం దీనిపై పెదవి విరిస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఆదాయ పన్ను శ్లాబ్ ఉందని హైదరాబాద్ టీజీఓ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ అన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి భారీ ఊరట అనడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment