పంచాయతీరాజ్ శాఖలో ‘సీన్ రివర్స్’
ఎంపీటీసీలకు పాత వేతనాలే మంజూరు చేసిన సర్కారు
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ సీన్ రివర్స్ అయింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాల్లో సర్కారు భారీగా కోతపెట్టింది. గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులకు రావాల్సిన గౌరవ వేతనం 9 నెలల బకాయి ఉండగా, మూడు నెలలకు సరిపడానే ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదలా ఉంచితే ఎంపీటీసీ సభ్యులకు తిరిగి పాత వేతనాలనే మంజూరు చేసింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఎంపీటీసీల వేతనాన్ని నెలకు రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా నెలకు రూ.750 చొప్పున లెక్కకట్టి బడ్జెట్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ సభ్యులకు రూ.5వేల చొప్పున నెల వేతనం రూ.3,19,60,000 ఇవ్వాల్సి ఉండగా, రూ.750 చొప్పున మూడు నెలలకు లెక్కకట్టి రూ.1,27,73,000 మాత్రమే మంజూరు చేసింది. కాస్త ఆలస్యమైనా నెలకు రూ.5వేల వేతనం వస్తుంది కదా అనుకున్న ఎంపీటీసీలకు ప్రభుత్వం రూ.750 చొప్పున వేతనం ఇవ్వడం ఏ మాత్రం మింగుడుపడటం లేదు. సర్పంచులకు గౌరవ వేతనం కింద రూ.26 కోట్లు రావాల్సి ఉండగా, రూ.7 కోట్లే మంజూరయ్యాయి. అయితే జడ్పీటీసీలకు రావాల్సిన 9 నెలల వేతన బకాయిల్లో ప్రస్తుతానికి మూడు నెలలే ఇచ్చినా, పెంచిన వేతనం ప్రకారమే మంజూరు కావడంతో కొంతమేర వారికి ఉపశమనం కలిగిం చింది.
ఎంపీటీసీల ఫోరం ఆందోళన
ఎంపీటీసీలకు పాత వేతనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ ఎంపీటీసీల ఫోరం శుక్రవారం సచివాలయంలో ఆందోళన వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను వాకబు చేయగా, కమిషనర్ కార్యాలయం నుంచి అందిన ప్రతిపాదనల మేరకే తాము ఉత్తర్వులు జారీ చే శామంటున్నారని ఎంపీటీసీల ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోళ్ల కరుణాకర్, మనోహర్‌రెడ్డి చెప్పారు. జరిగిన దాంట్లో తమ తప్పేమీ లేదని, తాము ప్రతిపాదనలను సక్రమంగానే పంపినా సచివాలయ అధికారులే తక్కువ మొత్తాన్ని మంజూరు చేసినట్లు కమిషనర్ కార్యాలయ సిబ్బంది చె ప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోయారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి విన్నవించనున్నట్లు తెలిపారు.