నేడో, రేపో ‘గురుకుల’ ఉత్తర్వులు
పోస్టులు, బడ్జెట్‌పై కసరత్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: కొత్త గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు నేడో, రేపో వెలువడనున్నాయి. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తయింది. శుక్రవారం సచివాలయంలో ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బి.మహేశ్‌దత్ ఎక్కాలతో విడతల వారీగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ చర్చలు జరిపారు. బడ్జెట్, పోస్టులు, ఇతర అవసరాలకు సం బంధించిన సవివరమైన ప్రతిపాదనలను సమర్పించినట్లు సమాచారం. టీచర్లు, సిబ్బంది పోస్టులు, ఆయా పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన బడ్జెట్‌పై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ ఏడాది 251 గురుకులాలను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఎస్సీలకు 130, మైనారిటీలకు 71, ఎస్టీలకు 50 పాఠశాలలను కేటాయించారు. మొత్తం 251 గురుకులాల ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల మేర అవసరమవుతాయని అంచనా వేశారు. అయితే, ప్రస్తుతం 5, 6 తరగతులను మాత్రమే ప్రారంభించనున్నందున, దశలవారీగా నిధులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.12 కోట్లు వ్యయం కావొచ్చని, 35 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అవసరమవుతారని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో డిగ్రీ కాలేజీకి 54 మంది వరకు టీచర్లు, సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా. జిల్లాలు, శాఖల వారీగా అందుబాటులో ఉన్న భవనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో స్కూళ్ల కు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పర్మనెంట్ టీచర్ల నియామక ప్రక్రియను చేపట్టే వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లను నియమించనున్నారు. వచ్చే నెల 1 నుంచి ఈ గురుకులాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చే స్తున్నారు.