వేములవాడ అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేములవాడలో మొదటిసారి జరగనున్న మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ప్రత్యేక ఏర్పాట్లకు ఇంకా మోక్షం లభించలేదు. పుష్కరాలకు, ఇతర దేవాలయాలకు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ తమ ఇలవేల్పుగా చెప్పుకునే ఎములాడ రాజన్న వైపు ఇంకా చూడలేదు. సమైక్య రాష్ట్రంలో 2012లో ఇక్కడికి వచ్చినప్పుడు రూ.200 కోట్లతో వేములవాడను వెన్నెలవాడగా మారుస్తానని కేసీఆర్ ప్రకటించారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదగిరిగుట్టకు రూ.100 కోట్లు కేటాయించి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలోని పలు దర్గాలకు వెళ్లి చాదర్‌లు సమర్పించుకోవడం, ఇతర దేవాలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఆయా దర్గాలు, ఆలయాలకు రూ.కోట్ల విలువైన ప్యాకేజీలు ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఎములాడ జాతరకు ఈసారైనా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద శివరాత్రి జాతరకు ఈసారి అత్యంత ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు.
సీఎం రాకపై ఆసక్తి..
ఆలయ చరిత్రలో ఇంతవరకు మహాశివరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉత్సవాలకు తప్పకుండా వస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదేరోజు కేసీఆర్ జన్మదినం కావడంతో ఆయన రాక మరింత ఆసక్తికరంగా మారింది. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సైతం ఇప్పటి వరకు వేములవాడ ఆలయాన్ని దర్శించుకోలేదు. అయితే లక్షలాది భక్తుల దర్శనాల మధ్య మూడురోజులు సాగే మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈసారి మరింత ఘనంగా జరుగుతాయన్న నమ్మకంతో మాత్రం అంతా ఎదురుచూస్తున్నారు.
దశ మారేదెన్నడు..?
అనేక శతాబ్దాల చరిత్ర ఉన్నా.. రాజన్న గుడి దశ మాత్రం మారడం లేదు. స్వామివారిపై నమ్మకంతో భక్తులు ఆనవాయితీ తప్పకుండా మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలామంది ఇతర ఆలయాలకు వెళ్లాలన్నా, కుటుంబ కార్యక్రమాలు, వ్యాపార లావాదేవీలు చేపట్టాలన్నా ముందుగా ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని వెళ్లే సంప్రదాయం ఉంది. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడిగా కొలువబడుతున్న రాజన్న గుడి అభివృద్ధిపై పాలకులకు నేటికీ చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. ఇక్కడి ఆలయంలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులను బట్టి చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. వేములవాడలో ఇరుకైన రోడ్లు ఇంకా అలాగే ఉన్నాయి. కలుషితాలతో కూడిన ధర్మగుండంలోనే పుణ్యస్నానాలు పూర్తి చేయాల్సి వస్తోంది. వసతిగదుల చాలక భక్తులు చెట్లకిందే సేదతీరడం నిత్యం కనిపిస్తుంది. టూరిజం గుర్తింపు ఓ కలగానే మిగిలిపోయింది. ఇలా భక్తులు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. భక్తుల ద్వారా సాలీనా రూ.70 కోట్ల ఆదాయం వస్తున్నా.. కనీస సౌకర్యాలు అంతంతం మాత్రంగానే ఉన్నాయి.
ఎక్కడి పనులు అక్కడే..
మహాశివరాత్రి జాతర ఉత్సవాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈసారి మూడు నుంచి నాలుగు లక్షల మంది జాతర మహోత్సవాలకు వస్తారని అంచనా వేశారు. ఆలయ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం రెండు దఫాలు సమావేశమై రూ.80 లక్షలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు పనులకు టెండర్లు పిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించినా.. పనులు మాత్రం ఆశిం చినంత వేగంగా జరగడం లేదు. సమయం దగ్గరపడ్డాక అధికారుల ఒత్తిడితో హడావుడిగా పనులు పూర్తి చేసి మమ అని పించుకునేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పనుల ప్రగతి ఇదీ.. : ధర్మగుండంలో పవిత్రస్నానాలు చేసేందుకు చర్యలు ప్రారంభించనేలేదు. మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల జాడేలేదు, కల్యాణకట్ట దుస్థితి అలాగే ఉంది. వసతి గదులకు రంగులు వేస్తూనే ఉన్నారు. టీటీడీ ధర్మశాలల పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చలవ పందిళ్లు వేస్తూనే ఉన్నారు. క్యూలైన్ల మరమ్మత్తులు ఇంకా వెల్డింగ్ దశలోనే ఉన్నాయి.
తాత్కాళిక మరుగుదొడ్ల పనులు ప్రారంభించనేలేదు. తాగునీటి సౌకర్యం మెరుగుపరిచేందుకు చర్యలు మొదలుపెట్టలేదు. ఆలయ వసతిగదుల్లో బెడ్స్ తదితర పనులు పూర్తి చేయలేదు. జాతర మహోత్సవాలు దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం మేల్కొనపోతే రాజన్న దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు ఇబ్బందులు పడక తప్పదు.
శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు
రోడ్లను వెంటనే వెడల్పు చేయాలి. క్యూలైన్లలో భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించాలి. వీటిలో టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలి. ఆలయ ఆవరణలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం కల్పించాల్సిన అవసరముంది. ధర్మగుండానికి ప్రొటెక్టెడ్ వాల్ నిర్మించడంతో పాటు గుడి చెరువు కట్టను ట్యాంక్‌బండ్‌గా మార్చడం, చెరువును విస్తరించడం చేయాలి. ధర్మగుండం ప్రాశస్థ్యాన్ని కాపాడుతూనే నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలి. చెరువును ఆనుకుని దేవాలయం ఉన్నందున టెంపుల్ టూరిజంగా మార్చడానికి వీలుంది. దాని చుట్టూ సుందర రమణీయ ప్రాంతంగా మార్చొచ్చు. ప్రస్తుతం వేసిన రింగ్ రోడ్డు మరింత విస్తరించగలిగితే రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. సౌకర్యవంతమైన అతిధిగృహాల సంఖ్య పెంచాలి. మంచినీటి ఎద్దడి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి. రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలి.
రాజన్న దిక్కు.. జర చూడరూ..!
Published Sat, Feb 7 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement