
పుష్కర పనులు వేగిరం చేయాలి
గోదావరి పుష్కర పనులను వేగవంతం చేయూలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద, మంగపేట గోదావరి పెర్రీపాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు.
- రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఏటూరునాగారం : జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు సంబంధించి నిర్మాణ పనులను వేగవంతం చేయూలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ముల్లకట్ట వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పస్రా నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సైడ్ బర్మ్స్ పోసి పుష్కరాల వరకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్‌హెచ్ ఎస్‌ఈ వసంతను ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎస్‌ఈ మదనయ్య మంత్రికి వివరించారు. పప్కాపురంలోని 900 మీటర్ల సీసీ రోడ్డుకు క్లియరెన్స్ కోసం అటవీశాఖ అనుమతి కోరుతూ లేఖ ఎందుకు రాయలేదని కలెక్టర్ ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాసి పనులు వేగవంతం చేయిస్తామన్నారు. జిల్లా నుంచి అన్ని ప్రాంతాలకు 375 బస్సులు కేటాయించామని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ మంత్రికి వివరించారు. నిరంతరం విద్యుత్ కోసం 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 6 ఏర్పాటు చేసి సుమారు 150 లైట్ల చొప్పున ఒక్కో ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ మోహన్‌రావు వెల్లడించారు. లక్నవరం, రామప్ప, గుడెప్పాడ్, మేడారం, గట్టమ్మ, ములుగు రోడ్డు, ఏటూరునాగారం క్రాస్ వద్ద 8 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు.
3 వేల సిబ్బందితో బందోబస్తు
పుష్కరాలకు వచ్చే భక్తులకు భద్రత ఇవ్వడానికి 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ తెలిపారు. మత్స్యశాఖ ద్వారా 98 మంది గజఈతగాల్లను నియమించామని, తెప్పలు, మరబోట్లు, సేఫ్ జాక్సిట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్‌రావు తెలిపారు. తాగునీటి కోసం రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేట ఘాట్ ల వద్ద 18 మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాం చందర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మహేందర్‌జీ, డీఎస్పీ రాజమహేంద్రనాయక్ పాల్గొన్నారు.
గోదావరి ఫెర్రీ పారుంట్ వద్ద పనుల పరిశీలన
మంగపేట : మంగపేట గోదావరి ఫెర్రీపాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంంగా పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయని మైనర్ ఇరిగేషన్ ఈఈ చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. జూన్ ఒకటి నుంచే రుతుపవనాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వర్షాలు పడితే పనులకు అంతరాయం కలుగుతుందని వర్షాలు పడకముందే జూన్ 15లోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.