ఆపసోపాలు | Pushkar stark funding for work | Sakshi
Sakshi News home page

ఆపసోపాలు

Published Fri, Mar 6 2015 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ఆపసోపాలు

ఆపసోపాలు

పుష్కర పనులకు  అరకొర నిధులు
హడావుడిగా  షార్ట్ టెండర్లు
యాత్రికులకు  సౌకర్యాల కల్పన సాధ్యమేనా?

 
ఏలూరు : గోదావరి పుష్కరాలకు మూడు నెలలే గడువు ఉంది. దేశం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం ముందునుంచీ ప్రతిపాదనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదలకాకపోవడం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దోగొప్పో నిధులు విడుదల అవుతుండగా, సకాలంలో పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. ఈ నెల రోజులు టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడానికే సరిపోతుంది. ఆ తరువాత రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు.. ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

స్నానఘట్టాలు, యాత్రికుల విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పుష్కరాలకు వివిధ పనుల నిమిత్తం జిల్లాకు రూ.923 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.657 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ లభిం చింది. ఇందులో 90 శాతం పనులకు టెండర్లు పిలవలేదు. దీంతో ఇప్పటివరకూ 10 శాతం పనులు మాత్రమే ప్రా రంభమయ్యాయి. ప్రధానంగా నిధుల లేమి అధికారులకు సంకటంగా మారిం ది. నిధులొచ్చాక రోజువారీ సమీక్షలు, నివేదికల ఇచ్చేందుకే కాలం సరిపోతుందని యంత్రాంగం ఆందోళన చెం దుతోంది. ప్రభుత్వం నిధుల విడుదలకు భరోసా ఇచ్చి, సమీక్షలను తగ్గిస్తే పుష్కర పనులు వేగం పుంజుకుంటాయనేది అధికారులు అభిప్రాయం. అరకొరగా నిధులను విడుదల చేస్తూ ఇటీవల జీవోలు జారీ కావడంతో పనులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన షార్ట్ టెండర్లు పిలుస్తున్నారు.

ఆర్ అండ్ బీకి రూ.296 కోట్లు

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సాధారణ పనులకు విడుదల చేయాల్సిన నిధులను పుష్కర పనులకు సర్కారు దారి మళ్లించింది. 83 పనులకు రూ. 296 కోట్లను విడుదల చేసింది. దీంతో అధికారులు ఆగమేఘాలపై పనులకు సంబంధించిన అంచనాలను రూపొం దించి ఎక్కడిక్కడ షార్ట్‌టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
 
13 ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రెండు వారాలైంది. ఆ నిధులను మునిసిపాలిటీలకు ఇవ్వకుండా పుష్కర పనులకు మళ్లించడం విమర్శలకు తావిస్తోంది. కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు మునిసిపాలిటీలకు రూ.92 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో 355 పనులను ప్రజారోగ్య శాఖ ద్వారా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖ పరంగా రూ.18.34 కోట్ల విలువైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇంకా నిధులు విడుదల కాలేదు. కేంద్రం ఇస్తానన్న స్వచ్ఛభారత్ నిధుల ప్రస్తావనే లేదు. మత్య్సశాఖ పరంగా బోట్లు, ఈతగాళ్ల నియామకం, వారికి శిక్షణ కోసం రూ.2 కోట్లు ఇటీవలే విడుదల అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement