short tenders
-
‘షార్టు’గానే కానిచ్చారు!
అనంతపురం సెంట్రల్ : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పామాయిల్, కందిపప్పు సరఫరా చేయడానికి నిర్వహించిన టెండర్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. షార్ట్ టెండర్ల ముసుగులో రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు మాత్రమే అవకాశం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లు విలువజేసే నిత్యావసర వస్తువుల సరఫరాకు రూ.లక్షల్లో బ్యాంకు పూచీకత్తు ఉండాలనే నిబంధనతో చిన్న వ్యాపారుల ఆశలపై గండి పడింది. ఫలితంగా టెండర్లలో తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే... ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 17 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు పామాయిల్, కందిబేడలు సరఫరాకు ఈ నెల 16న, కోడిగుడ్ల సరఫరాకు ఈనెల 17న టెండర్ ప్రకటన విడుదల చేశారు. పామాయిల్, కందిబేడల సరఫరాకు సంబంధించి షెడ్యూళ్లు దాఖలు చేయడానికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సమక్షంలో టెండర్లు ఖరారు చేయనున్నారు. కోడిగుడ్ల సరఫరాకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ దరఖాస్తులు విక్రయిస్తారు. మూడు గంటలలోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. అయితే.. టెండర్లలో పాల్గొనేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. గడువు మాత్రం ఒకరోజే ఇచ్చారు. ముఖ్యంగా పామాయిల్ సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.10 లక్షలు, కందిబేడలు సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.20 లక్షలు బ్యాంకు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సరఫరా చేసిన అనుభవం, వాహన సౌకర్యాలు తప్పనిసరి. ఇలాంటి ఆరు ఆరు రకాల నిబంధనలు పెట్టారు. వీటిలో పేర్కొన్న అంశాలన్నీ సరి చూసుకోవడానికి చిన్న కాంట్రాక్టర్లకైతే కనీసం వారం పడుతుంది. అయితే.. ఐసీడీఎస్ అధికారులు మాత్రం బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఒకరోజు మాత్రమే అవకాశమిచ్చారు. పామాయిల్ సరఫరాకు 10 దరఖాస్తులు మాత్రమే అమ్ముడుపోయాయి. అందులోనూ ఆరుగురు దరఖాస్తుదారులు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశారు. కందిబేడల సరఫరాకు 11 దరఖాస్తులు అమ్ముడుపోగా..ఆరు దాఖలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన షార్ట్ టెండర్ ప్రభావం చిన్న కాంట్రాక్టర్లపై ఏ విధంగా పడిందో అర్థమవుతోంది. ఎక్కువ మంది బ్యాంకు పూచీకత్తు చూపించలేమనే భావనతో తప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గురువారం టెండర్ ప్రారంభం సమయంలో మరెంత మంది తప్పుకుంటారో వేచి చూడాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ... భారీ బందోబస్తు ఐసీడీఎస్ టెండర్లు ైరె ల్వే టెండర్లను తలపించాయి. గతంలో కనీసం ఒక కానిస్టేబుల్ లేకుండానే టెండర్లు నిర్వహించే అధికారులు.. ఈ ఏడాది మాత్రంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బుధవారం ‘సాక్షి’లో ‘ఐసీడీఎస్ టెండర్లలో దౌర్జన్యకాండ’ శీర్షికన వెలువడిన కథనం ద్వారా ముఖ్యప్రజాప్రతినిధి అనుచరులు చేపడుతున్న బరితె గింపు కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ కథనంతో ఐసీడీఎస్ అధికారులే కాకుండా జిల్లా కలెక్టర్ శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అప్రమత్తమయ్యారు. బుధవారం అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆధ్వర్యంలో ఒక సీఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బంది, స్పెషల్‌పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయాన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి టెండర్ల నిర్వహణను పరిశీలించారు. అనంతపురం ఆర్డీఓ ఉస్సేన్‌సాహెబ్, తహశీల్దార్ షేక్ మహబూబ్‌బాషాలను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. ఐసీడీఎస్‌లోని కొందరి అధికారుల తీరుపై విమర్శలు రావడంతో ప్రాజెక్టు డెరైక్టర్ జుబేదాబేగం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకూ సెక్షన్లో పనిచేసిన అధికారులను తప్పించి వివిధ ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లు, సమగ్ర బాలల పరిరక్షణ సమితి(ఐసీపీఎస్) అధికారులను టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకునేలా ఆదేశించారు. ఫలితంగా బుధవారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దరఖాస్తులు స్వీకరణ ముగిసింది. -
ఆపసోపాలు
పుష్కర పనులకు అరకొర నిధులు హడావుడిగా షార్ట్ టెండర్లు యాత్రికులకు సౌకర్యాల కల్పన సాధ్యమేనా? ఏలూరు : గోదావరి పుష్కరాలకు మూడు నెలలే గడువు ఉంది. దేశం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం ముందునుంచీ ప్రతిపాదనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదలకాకపోవడం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దోగొప్పో నిధులు విడుదల అవుతుండగా, సకాలంలో పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. ఈ నెల రోజులు టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడానికే సరిపోతుంది. ఆ తరువాత రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు.. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్నానఘట్టాలు, యాత్రికుల విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పుష్కరాలకు వివిధ పనుల నిమిత్తం జిల్లాకు రూ.923 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.657 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ లభిం చింది. ఇందులో 90 శాతం పనులకు టెండర్లు పిలవలేదు. దీంతో ఇప్పటివరకూ 10 శాతం పనులు మాత్రమే ప్రా రంభమయ్యాయి. ప్రధానంగా నిధుల లేమి అధికారులకు సంకటంగా మారిం ది. నిధులొచ్చాక రోజువారీ సమీక్షలు, నివేదికల ఇచ్చేందుకే కాలం సరిపోతుందని యంత్రాంగం ఆందోళన చెం దుతోంది. ప్రభుత్వం నిధుల విడుదలకు భరోసా ఇచ్చి, సమీక్షలను తగ్గిస్తే పుష్కర పనులు వేగం పుంజుకుంటాయనేది అధికారులు అభిప్రాయం. అరకొరగా నిధులను విడుదల చేస్తూ ఇటీవల జీవోలు జారీ కావడంతో పనులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన షార్ట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ అండ్ బీకి రూ.296 కోట్లు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సాధారణ పనులకు విడుదల చేయాల్సిన నిధులను పుష్కర పనులకు సర్కారు దారి మళ్లించింది. 83 పనులకు రూ. 296 కోట్లను విడుదల చేసింది. దీంతో అధికారులు ఆగమేఘాలపై పనులకు సంబంధించిన అంచనాలను రూపొం దించి ఎక్కడిక్కడ షార్ట్టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 13 ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రెండు వారాలైంది. ఆ నిధులను మునిసిపాలిటీలకు ఇవ్వకుండా పుష్కర పనులకు మళ్లించడం విమర్శలకు తావిస్తోంది. కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు మునిసిపాలిటీలకు రూ.92 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో 355 పనులను ప్రజారోగ్య శాఖ ద్వారా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖ పరంగా రూ.18.34 కోట్ల విలువైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇంకా నిధులు విడుదల కాలేదు. కేంద్రం ఇస్తానన్న స్వచ్ఛభారత్ నిధుల ప్రస్తావనే లేదు. మత్య్సశాఖ పరంగా బోట్లు, ఈతగాళ్ల నియామకం, వారికి శిక్షణ కోసం రూ.2 కోట్లు ఇటీవలే విడుదల అయ్యాయి. -
దండుకునేందుకే..
అనంతపురం కార్పొరేషన్ : అభివృద్ధి పనుల నిర్వహణకు షార్ట్ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా.. అనంతపురం నగర కార్పొరేషన్ అధికారులు శాఖా పరంగా చేసేందుకే మొగ్గు చూపడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షల పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టడంతో నిధులు దండుకునేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం వంటి అత్యవసర విభాగాలకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో లేదా శాఖా పరంగా చేపడతారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పనులు అత్యవసరంగా చేయాల్సి వస్తే షార్ట్ టెండర్ పద్ధతి అవలంబిస్తారు. ప్రస్తుతం రూ. 35 లక్షల వ్యయం కాగల డివైడర్ల మరమ్మతు, రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, ట్రాఫిక్ ఐల్యాండ్‌కు గ్రిల్స్ ఏర్పాటుతోపాటు, రూ.5 లక్షల వ్యయంతో వంకల్లో పూడిక తీసేపనులు ప్రారంభించారు. ఈ పనుల్లో షార్ట్ టెండర్ పద్ధతి పాటించే అవకాశం ఉన్నా శాఖాపరంగా నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అన్ని పనులనూ ఇదే పద్ధతిలో చేశారా అంటే అదీ లేదు. కొన్ని పనులను శాఖాపరంగా చేసేందుకు అనుమతిస్తూనే, మరి కొన్నింటికి షార్ట్ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించిన ప్యాచ్వర్క్ల్లో, వంకల్లో పూడికతీసే పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.