
దండుకునేందుకే..
అనంతపురం కార్పొరేషన్ : అభివృద్ధి పనుల నిర్వహణకు షార్ట్ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నా.. అనంతపురం నగర కార్పొరేషన్ అధికారులు శాఖా పరంగా చేసేందుకే మొగ్గు చూపడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షల పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టడంతో నిధులు దండుకునేందుకేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం వంటి అత్యవసర విభాగాలకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో లేదా శాఖా పరంగా చేపడతారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పనులు అత్యవసరంగా చేయాల్సి వస్తే షార్ట్ టెండర్ పద్ధతి అవలంబిస్తారు. ప్రస్తుతం రూ. 35 లక్షల వ్యయం కాగల డివైడర్ల మరమ్మతు, రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు, ట్రాఫిక్ ఐల్యాండ్‌కు గ్రిల్స్ ఏర్పాటుతోపాటు, రూ.5 లక్షల వ్యయంతో వంకల్లో పూడిక తీసేపనులు ప్రారంభించారు.
ఈ పనుల్లో షార్ట్ టెండర్ పద్ధతి పాటించే అవకాశం ఉన్నా శాఖాపరంగా నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అన్ని పనులనూ ఇదే పద్ధతిలో చేశారా అంటే అదీ లేదు. కొన్ని పనులను శాఖాపరంగా చేసేందుకు అనుమతిస్తూనే, మరి కొన్నింటికి షార్ట్ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులకు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ల్లో, వంకల్లో పూడికతీసే పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.