
పుష్కరాలకు టోకెన్ గ్రాంట్ 100 కోట్లు: యనమల
రాజమండ్రి: వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు టోకెన్ గ్రాంట్(ప్రాథమిక కేటాయింపు)గా రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ శుక్రవారం రాజ మండ్రి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో సమావేశమైంది.
ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. యనమల మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు ఎంత ఖర్చయినా భరిస్తామని, అందుకు ఆకాశమే హద్దని అంటూనే విడుదల చేసే నిధులకు మాత్రం పరిమితి విధించారు. పుష్కరాలను అవకాశంగా తీసుకుని అన్ని అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు.