
తొక్కిసలాటను మర్చిపోయారా?
పుష్కరాలు పూర్తయినా విచారణ ఊసే లేదు
ఆధారాల మాయంపై అనుమానాలు
‘సిట్’పై ఉన్న శ్రద్ధ ఇప్పుడు లేకపోవడంపై విమర్శలు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో తొలి రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 27 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనపై ఇంకా విచారణ ప్రారంభించడం లేదు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటులో చూపిన శ్రద్ధ ఇప్పుడెందుకు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై ఆరోపణలు వస్తే వేగంగా స్పందించిన ప్రభుత్వం పుష్కరాల్లో తొక్కిసలాట అంశాన్ని ఎందుకు విస్మరిస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పుష్కరాల తొలిరోజైన జూలై 14న తొక్కిసలాట చోటు చేసుకుంది. పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ, సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించడం, భక్తులను రెండున్నర గంటల పాటు ఆపేయడం... ఇవన్నీ తొక్కిసలాటకు కారణమనే విమర్శలు వచ్చాయి. దీనిపై పుష్కరాలు ముగిశాక ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని జూలై 15న ప్రభుత్వం ప్రకటించింది.
జూలై 25తో పుష్కరాల ఘట్టం ముగిసినా విచారణ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ.. పుష్కరాల నిర్వహణ అద్భుతమని కీర్తించుకోవడం మినహా తొక్కిసలాటపై నిర్ణయం తీసుకోలేదు. విచారణ జరిగితే సీఎంకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పుష్కర ఘాట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు సహా తొక్కిసలాటకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమవుతున్నాయనే వాదనలున్నాయి. ఆధారాలు, రికార్డుల్లో ఎన్ని ‘మార్పులు చేర్పులు’ జరుగుతాయో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.