బాబు వైఫల్యమే: బొత్స
పుష్కర మరణాలకు ఆయనే బాధ్యత వహించాలి
ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యం ఏర్పాట్లకు ఇవ్వలేదు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల మరణాలకు సీఎం చంద్రబాబునాయుడే పూర్తిగా బాధ్యత వహించాలని, ఆయన ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన వ్యక్తిగత ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని పుష్కరాల ఏర్పాట్లకు ఇవ్వనేలేదని మండిపడ్డారు. తన బొమ్మలు పెట్టుకోవడానికి చంద్రబాబు చూపిన ఆర్భాటం బారికేడ్ల నిర్మాణంపై చూపిఉంటే ఈ దారుణం జరిగేదే కాదన్నారు. ఘాట్‌లవద్ద ఎంతమంది భక్తుల రాకపోకలుంటాయో ప్రభుత్వం సరైన అంచనాలు వేయలేకపోయిందన్నారు. తానొక్కడినే పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాననే కీర్తి కండూతికోసం చంద్రబాబు తాపత్రయ పడినందువల్లనే ఈ దారుణం జరిగిందన్నారు. చంద్రబాబు తన పుష్కరస్నానంకోసం ఘాట్‌లో దిగి మూడు గంటలసేపు భక్తులను నిలబెట్టారని, దీంతో ఆయన వెళ్లిపోయాక ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించాయన్నారు. ఘాట్‌ల వద్ద ఎక్కడా ఒక్క అంబులెన్స్‌గానీ, వైద్యుడు, నర్సుగానీ కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా బొత్స మంగళవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. పుష్కరాల ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి: అంబటి
పవిత్ర పుష్కరాల్లో మరణాలు చోటు చేసుకున్నందుకు బాధ్యుడైన చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలకు రూ.1,650 కోట్ల భారీ నిధులు కేటాయించినా ఏర్పాట్లలో అడుగడుగునా చంద్రబాబు అలసత్వం, అసమర్థత కనిపిస్తోందన్నారు.
ఇవి చంద్రబాబు హత్యలే..
గోదావరి పుష్కరాల్లో సంభవించిన మరణాలు చంద్రబాబు చేసిన హత్యలేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ దుయ్యబట్టారు. గతంలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే ఐదుగురు మృతిచెందితే ఆనాటి వైఎస్ ప్రభుత్వాన్ని గద్దెదిగాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఈ మర ణాలపై ఏమంటారని వారు ప్రశ్నించారు.