గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు
6 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
మంత్రులు అల్లోల, ఈటల, జోగు రామన్న
గోదావరిఖని/ధర్మపురి: గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్నలు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ధర్మపురి వద్ద చేపడుతున్న పుష్కర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2003లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 27 ఘాట్ల వద్ద పుష్కరాలు నిర్వహించగా... తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్ల ఖర్చు చేసి 106 చోట్ల పుష్కరఘాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
దాదాపు అన్ని చోట్ల పుష్కర పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత పుష్కరాల సమయంలో మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తే... ఈసారి 6-8 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.