తెలుగు గంగ కాల్వ గండ్లు పూడ్చేందుకు ఖరారు కాని టెండర్లు
50 వేల ఎకరాల్లో పంటలకు దెబ్బ
రైతుల్లో తీవ్ర ఆందోళన
తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపు 50 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది.
తిరుపతి: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్న చందాన తయారైంది తెలుగుగంగ ఆయకట్టు రైతుల పరి స్థితి. భారీవర్షాలు కురిసినా రైతులకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ఇప్పటికే పలు చెరువులకు గండ్లు పడి నీరు వృథాగా పోయాయి. తొట్టంబేడు మండలం కనపర్తి గ్రామ సమీపంలో 71వ కిలోమీటరు వద్ద తెలుగుగంగ కాలువకు రెండ్లు గండ్లు పడ్డాయి. రెండు నెలలు గడిచినా వాటిని పూడ్చిన పాపాన పోలేదు. దీంతో తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. గంగ నీటిపై ఆధారపడి శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజక వర్గాల రైతులు దాదాపు 50 వేల ఎకరాల్లో వరి, చెరుకు, వేరుశెనగ పంటలు సాగు చేశారు. పలుచోట్ల తెలుగు గంగ నీరు అందకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే స్థితికి చేరుకుంది. మూడు, నాలుగు రోజుల్లో నీరు విడుదల కాకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువల ద్వారా, చెరువుల్లో నీటిని నింపి ఆయకట్టుకు విడుదల చేస్తారు. నెల్లూరు జిల్లా సరిహద్దు వెంకటగిరి వరకు కాలువ 61వ కిలోమీటరు వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే భారీ వర్షాలకు జిల్లాలోని 71వ కిలోమీటరు వద్ద గండ్లు పడటంతో ఆయకట్టుకు నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉండగా తాత్కాలికంగా మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తే కేవలం 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం..
కాలువల మరమ్మతుల కోసం అధికారులు రూ.1.86 కోట్లతో అంచనాలు రూపొం దించారు. అయితే ఇంకా టెండర్ల దశలోనే ఉండటం గమనార్హం. టెండర్లలకు తుది గడువు ఈనెల 25గా నిర్ణయించారు. తాత్కాలికంగా కాలువల మరమ్మతులు చేపడితే నీరు విడుదలచేసే అవకాశం ఉంది. అయితే రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని భావించిన అధికారులు మొక్కుబడిగా పనులు చేపడుతున్నారు.
గంగ కోసం బెంగ
Published Wed, Jan 20 2016 2:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement