రుద్రవరం, న్యూస్‌లైన్: అటవీ అధికారులు రుద్రవరం, చలిమ రేంజ్ పరిధిలో శుక్రవారం మెరుపు దాడులు చేశారు. దాడుల వివరాలను జిల్లా స్కాడ్ డీఎఫ్‌ఓ చంద్రశేఖర్ విలేకరులకు వివరించారు. ఈ మేరకు.. మొదట చాగలమర్రి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు ట్రాస్క్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఫారెస్ట్ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి 28 ఎర్రచందనం, 175 నానాజాతి దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని పెద్దకంబాలూరు, పందిర్లపల్లె గ్రామాల మధ్య వాగులో దాచి ఉంచిన 63 దుంగలు లభించాయి. వీటిలో 8 ఎర్రచందనం దుంగలు, 29 రేలా, 13 ఏగ, 8 సండ్ర, 2 బట్టగెనుపు, 2 ఎర్ర బుటెకె, 1 చిండుగ జాతులకు చెందిన దుంగలు ఉన్నాయి.
అలాగే పెద్దకంబలూరు, చిన్నకంబలూరు, పందిర్లపల్లె గ్రామాలకు చెందిన నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. అలాగే అహోబిలం, దొర కొట్టాల గ్రామాల మధ్య తెలుగు గంగ ప్రధాన కాల్వ సమీపంలోని ముల్లపొదల్లో దాచిన 20 ఎర్రచందనం దుంగలను స్పెషల్ పార్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అహోబిలం కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. చలిమ రేంజ్ పరిధిలోని గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో దాచిన 120 సండ్ర జాతికి చెందిన దుంగలను స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ట్రాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు.
ఎర్రచందనం దుంగలతోపాటు నానాజాతికి చెందిన దుంగలను ఎర్రచందనం దుంగలుగా విక్రయిస్తున్నారు. మొత్తం 203 దుంగలను ఎర్రచందనం దుంగలగా విక్రహిస్తే రూ. 50 లక్షలు విలువ ఉంటుందని డీఎఫ్‌ఓ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల్లో తిరుపతి టాస్క్‌పోర్స్ అధికారులు సీఐ మద్దయ్య ఆచారి, ఎస్‌ఐ ఆశోక్ కుమార్, రేంజర్ విశ్వేశ్వరరావు, డీఆర్‌ఓ వెంకటరామిరెడ్డి, ఫారెస్టర్ నాగరాజు, మొబైల్ పార్టీ అధికారి థాయన్న, అహోబిలం, మహనంది డీఆర్‌ఓలు వేణు ప్రసాద్, దేవరాజు, సెక్షన్ అధికారులు నాగ తిరుపాలు, జాకీర్ ఉశ్సేన్, రామాంజనేయులు పాల్గొన్నారు.
అటవీ అధికారుల మెరుపు దాడులు
Published Sat, Sep 14 2013 5:14 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement